
బంగారం ధరలు రోజురోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. వెండి రేటు కూడా జీవితకాల గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు (ఆగస్టు 30) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1640 పెరిగి రూ. 1,04,950 వద్దకు చేరింది. కేజీ వెండి రూ. 1,31,000 వద్ద ఉంది. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే.. ఈ ధరలు చాలా ఎక్కువ అని తెలుస్తోంది.
ఈ సంవత్సరం భారతదేశంలో బంగారం ధరలు దాదాపు 32 శాతం పెరిగాయి. ఇది పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులకు కొంత భారమైపోయింది. జనవరిలో పది గ్రాముల గోల్డ్ రూ. 80,000 నుంచి ప్రారంభమై.. మార్చి నాటికి రూ.90,000 చేరుకుంది. కాగా ఇప్పుడు ఈ ధరలు లక్ష రూపాయలు దాటేసింది.
గ్లోబల్ మార్కెట్లో మే 2025 ప్రారంభంలో బంగారం ధర ఔన్సుకు 3392 డాలర్ల వద్ద ఉండేది. జూన్ మధ్య నాటికి ఇది 3368 డాలర్ల వద్దకు చేరుకుంది. గోల్డ్ రేటు విపరీతంగా పెరగడానికి రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న యూఎస్ డాలర్ విలువ మాత్రమే కాకుండా.. రూపాయి విలువ తగ్గడం కూడా ప్రధాన కారణమైందని నిపుణులు చెబుతున్నారు.
ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ 'అక్ష కాంబోజ్' మాట్లాడుతూ.. పండుగ సీజన్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ అనిశ్చితి, బలహీనపడుతున్న డాలర్ ఇండెక్స్ మధ్య పెట్టుబడిదారులు బంగారం వైపు ఆకర్షితులయ్యారు. భారత ఎగుమతులపై అమెరికా విధించిన.. 50 శాతం సుంకాలు కూడా పసిడి డిమాండును మరింత పెంచిందని అన్నారు.
ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
బంగారం ధరలు పెరగడానికి సీజనల్ డిమాండ్ మరో కీలకమైన అంశం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారతదేశంలో పండుగలు.. వివాహాల సీజన్ మొదలైపోయింది. దీనివల్ల కూడా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధర ఎంత పెరిగినా.. బంగారంపై పెట్టుబడి ఎప్పటికి మంచి లాభాలను తెస్తుందనేది మాత్రం వాస్తవం.