
కాన్‌బెర్రా: త్వరతో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ఫ్రాన్స్, యూకే, కెనడాలున్నాయి.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోమవారం ఒక ప్రకటనలో సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆయా దేశాలకు మద్దతు పలికింది. అయితే ఆస్ట్రేలియా గుర్తింపు అనేది పాలస్తీనా అథారిటీ నుండి అందుకున్న నిర్దిష్ట హామీలపై ఆధారపడి ఉంటుందని అల్బనీస్ స్పష్టం చేశారు. వీటిలో హమాస్‌ను పాలస్తీనా ప్రభుత్వం నుండి తొలగించడం, గాజాను సైనికీకరణ నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం మొదలైనవి ఉన్నాయి.
గాజాలో మానవతా సంక్షోభంపై ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియా అధికారులు గాజాలో కొనసాగుతున్న ఆకలి మంటలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల గాజాలో పెద్ద ఎత్తున సైనిక దాడికి ప్రణాళికలు వేయడాన్ని ఆస్ట్రేలియా ఖండించింది. మధ్యప్రాచ్యంలో హింసాయుత ఘటనలను విచ్ఛిన్నం చేయడానికి, గాజాలో సంఘర్షణలు, ఆకలిని అంతం చేయడానికి పాలస్తీనా దేశపు గుర్తింపు అనేది పరిష్కారం మార్గం అవుతుందని ప్రధాని అల్బనీస్ అన్నారు.