మనసు దోచే మయూరి గార్డెన్‌ | Eco Urban Park with all the amenities | Sakshi
Sakshi News home page

మనసు దోచే మయూరి గార్డెన్‌

Aug 14 2025 4:44 AM | Updated on Aug 14 2025 4:45 AM

Eco Urban Park with all the amenities

సర్వ హంగులతో ఎకో అర్బన్‌ పార్క్‌ 

వన ప్రేమికులకు స్వర్గధామం 

సాహస కృత్యాలకు వేదిక.. వారాంతంలో సందడి 

ప్రకృతి అందాలు తిలకించేలా వ్యూ పాయింట్లు 

ఫొటో షూట్‌లకు భలే క్రేజీ 

ఆకట్టుకుంటున్న జంగిల్‌ సఫారీ 

కర్ణాటక, ఏపీ నుంచి పర్యాటకుల తాకిడి 

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: పర్యాటక పరంగా మహబూబ్‌నగర్‌ జిల్లా దూసుకెళ్తోంది. మయూరి నర్సరీ నుంచి మయూరి ఎకో అర్బన్‌ పార్క్‌గా రూపాంతరం చెందిన మహా వనమే ఇందుకు నిదర్శనం. 2,087 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని పరుచుకుని ఆహ్లాదం పంచుతోంది. చిన్నపిల్లల నుంచి మహిళలు, పురుషులు తేడా లేకుండా వృద్ధులు.. ఇలా అన్నివర్గాల వారికి వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సాహస క్రీడలకు వేదికగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అద్భుతమైన పిక్నిక్‌ స్పాట్‌గా విరాజిల్లుతున్న సహజసిద్ధ వనక్షేత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

» మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అప్పనపల్లి సమీపంలో మయూరి ఎకో అర్బన్‌ పార్క్‌కు 2015 జూన్‌ 3న శంకుస్థాపన చేశారు. 2017 ఏప్రిల్‌ 17న ప్రారంభించిన ఈ పార్క్‌ పర్యాటకులతో నిత్యం సందడి చేస్తోంది. సెలవు, వారాంతపు రోజుల్లో మరీ ఎక్కువగా పర్యాటకుల తాకిడితో కళకళలాడుతోంది. రాష్ట్రంలోని పెద్ద నగరాలతో పాటు కర్ణాటక, ఏపీ నుంచి పర్యాటకులు.. మయూరి అర్బన్‌ ఎకో పార్కును సందర్శిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. 

» పర్యాటకులు సేదదీరేందుకు ఏర్పాటు చేసిన పచ్చదనం.. తివాచీని తలపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు గార్డెన్‌లో కూర్చొని సేదదీరుతున్నారు. యోగా చేసుకునే వారికి పార్క్‌లో ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. రోజూ ఇక్కడికి వందలాది మంది వచ్చి యోగ సాధన చేసుకునేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పార్క్‌లో చిన్నారు లు, పెద్దలకు ప్రత్యేకంగా ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌ ఏ ర్పాటు చేశారు. వివిధ రకాల వ్యాయామాలకు ఆరు పరికరాలను సమకూర్చారు. వెయిస్ట్‌ టర్న్‌ ట్విస్టర్, సిట్‌ అప్‌ బెంచ్, రోవర్, బాక్‌ పుల్‌ డౌన్, రైడర్, హెల్త్‌ వాకర్‌ ఉన్నాయి. 

సీతాకోకచిలుకల గార్డెన్‌ 
ప్రవేశద్వారం ఎదుట మొదట కనిపించేది బట్టర్‌ఫ్లై గార్డెన్‌. ఇందులో ఎన్నో రకాల మొక్కలు నాటారు. గతంలో నాటినవి.. ఇప్పుడు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. సీతాకోకచిలుకలను ఆకట్టుకునేలా స్వర్ణ గన్నేరు, పారిజాతం, విష్ణుశంఖం, మందారం వంటి 45 రకాల మొక్కలు ఉన్నాయి. 

12 రాశులు.. 12 మొక్కలు  
తెలుగు రాశులు 12 ఉంటాయి. ఈ మేరకు పార్క్‌లో రాశి నవగ్రహ వనం ఏర్పాటు చేశారు. రాశుల పేర్లతోపాటు మొక్కలు వాటి సాంస్కృతిక నామాలను బోర్డుపై కనిపించేలా రాశారు. ఏడాకుల పాలు (వృషభం), అశోక/వెదురు (మిథునం), ఎర్రచందనం (మేషం), మర్రి (మీనం), జమ్మి (కుంభం), సిస్సు (మకరం), రావి (ధనస్సు), సండ్ల (వృశి్చకం), పొగడ (తుల), మామిడి (కన్య), రేగు (సింహం), మోదుగల (కర్కాటకం) నాటారు. 

అడల్ట్‌ వాటర్‌ బోటింగ్‌ 
పార్క్‌ చివరి భాగంలో చెక్‌డ్యాం నిర్మించి అందులో వాటర్‌ బోటింగ్‌ ఏర్పాటు చేశారు. బోటింగ్‌కు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇద్దరు కూర్చుని సైకిల్‌లా తొక్కుతూ ముందుకు సాగవచ్చు. పచ్చని అందాల మధ్య నీటిలో విహారం ప్రత్యేక అనుభూతి మిగులుస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. పది నిమిషాలకు ఒక్కొక్కరికి పది నిమిషాలకు రూ.100 వసూలు చేస్తున్నారు. 

పల్లె వాతావరణం 
ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో నే విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల పై వారికి అవగాహన కరువవుతోంది. ఈ నేపథ్యంలో పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్‌ పర్యాటకులకు ఆకట్టుకుంటోంది. మనిషి ఎద్దులబండిని నడిపేలా చిత్రం, వీటి వెనుక గుడిసె, చేదు డుబావి ఏర్పాటు చేశారు. వెదురు ఉత్పత్తులతో తయారు చేసిన వన కుటీరం అమితంగా ఆకట్టుకుంటోంది. 

రెయిన్‌ ఫారెస్ట్, వాటర్‌ ఫాల్స్‌ అద్భుతం 
పార్క్‌లో రెయిన్‌ ఫారెస్ట్‌ ప్రత్యేక అనుభూతిని మిగులుస్తోంది. సహజసిద్ధ వాతావరణంలో వర్షం పడుతున్నట్లు కృత్రిమంగా ఏర్పాటు చేశారు. చెరువు నుంచి పైపుల ద్వారా నీటిని పంపింగ్‌ చేసేలా ప్రత్యేకమైన సెట్టింగ్‌ ఏర్పాటు చేయడం ఆకర్షిస్తోంది. గుట్టపై జాలువారుతున్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెరువు నుంచి పైకి నీళ్లు పంపింగ్‌ చేసి.. అక్కడ నిల్వ చేసి.. వదిలిపెడుతున్నారు. ఇలా ఏర్పడిన వాటర్‌ ఫాల్స్‌ సందర్శకులను మైమరిపింపజేస్తోంది. 

సాహస విన్యాసాలకు వేదిక  
మయూరి ఎకో అర్బన్‌ పార్క్‌ సాహస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. రూ.50తో టైర్‌ బ్రిడ్జి, బాంబో బ్రిడ్జి, వాల్‌ క్లైంబింగ్‌ చేయవచ్చు. రూ.200తో సైక్లింగ్, రూ.100తో జిప్‌లైన్, వర్షాకాలం తర్వాత ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌ చేసే అవకాశం కల్పిస్తారు. యువకులు, విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా ఈ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. 

కరెన్సీ పార్క్‌  
వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను వృత్తాకారంలో ఏర్పాటు చేశారు. ఒక్కో కరెన్సీ నోటు వద్ద సంబంధిత దేశం పేరు, ఏమని పలకాలో వివరంగా రాశారు. భారతదేశం, ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫిన్‌లాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, క్యూబా, వెనిజులా దేశాలకు చెందిన కరెన్సీ నోట్ల వివరాలు పిల్లలు గుర్తుంచుకునేలా ఏర్పాటు చేశారు. 

క్రీడాభిమానుల వేదిక ఆర్చరీ జోన్‌ 
పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆర్చరీ జోన్‌ క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. సెలవుల్లో మినహా రోజూ ఇది అందుబాటులో ఉంటోంది. ఈ ఆర్చరీ జోన్‌లో ఐదు విల్లులు కొట్టడానికి రూ.50 వసూలు చేస్తారు. ఏటా వేసవిలో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్చరీ శిక్షణ ఇస్తున్నారు. 

జంగిల్‌ సఫారీ 
మయూరి అటవీ ప్రాంతంలో జంగిల్‌ సఫారీకి అవకాశముంది. అందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక ట్రిప్‌కు రూ.2వేల చార్జితో ఎనిమిది మంది వరకు వాహనంలో అడవి మొత్తం చుట్టి రావొచ్చు. అడవి జంతువులతోపాటు రకరకాల చెట్లను చూడవచ్చు. 

నైట్‌ క్యాంపింగ్‌కు ప్రత్యేక ప్యాకేజీ 
ఎకో పార్క్‌లో ఒకరోజు, రాత్రివేళలో ప్రత్యేక నైట్‌ క్యాంపింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి రూ.1,500 ప్యాకేజీతో డిన్నర్, భోజనంతో పాటు హైకింగ్‌ ఫారెస్ట్, జిప్‌లైన్‌ అండ్‌ రోప్‌ విన్యాసాలు, రెయిన్‌ ఫారెస్ట్, వాటర్‌ఫాల్, జిప్‌ సైక్లింగ్‌కు అవకాశం కల్పించారు. కొంతకాలంగా ఈ ప్యాకేజీ కొనసాగడం లేదు. త్వరలో పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 

పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే..  
మయూరి ఎకో అర్బన్‌ పార్క్‌లో ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్‌ పార్క్‌కు అన్ని హంగులు అద్దారు. చూడగానే ఆకట్టుకునేలా పార్క్‌ ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. లోపలికి ప్రవేశించారో.. లేదో.. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే. జారుబండలు, ఊయలలు, రోలింగ్, టైర్‌ స్వింగ్, అప్‌ అండ్‌ డౌన్‌ బల్లలు, అంబరిల్లా ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. కోతులు, చింపాంజీల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల వాటర్‌ బోటింగ్‌కు విశేష స్పందన వస్తోంది. వాటర్‌ బోటింగ్‌కు 10 నిమిషాలకు రూ.50 చార్జి వసూలు చేస్తున్నారు.

‘మకావ్‌’అదరహో..  
పార్క్‌లో ఏర్పాటు చేసిన చిలుక జాతికి చెందిన గ్రీన్‌వింగ్డ్‌ మకావ్‌ పక్షి సందర్శకులను ఆకట్టుకుంటోంది. దక్షిణ అమెరికా అడవుల్లో గుంపులుగా నివసించే ఈ పక్షిని ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. ఈ పక్షి జీవితకాలం 60 నుంచి 80 ఏళ్లు అంటూ వివరాలు తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయడంతో.. పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం అందుతోంది. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్వాన్‌ 
పార్క్‌లో ఏర్పాటు చేసిన కొలనులో నలుపు, తెలుపు రంగుల హంసల సందడి ఆకట్టుకుంటోంది. ఆ్రస్టేలియా ఖండానికి చెందిన ఈ హంసలు ఎక్కువ సేపు నీటిమీద విహరిస్తూ గడుపుతాయి. ఆకులు, గింజలు వీటి ఆహారం. జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్లు అన్న వివరాలను బోర్డుపై రాసి పెట్టారు. 

చెట్ల మధ్య నడక వంతెన 
పార్క్‌ మధ్యభాగంలో ఏర్పాటు చేసిన నడక వంతెన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పక్క నడక వంతెన ఎక్కి.. మరోచోట దిగేలా ఏర్పాటు చేశారు. ఈ నడక వంతెనపై చిన్నారులతోపాటు పెద్దలు వాకింగ్‌ చేస్తున్నారు. వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైనోసర్‌ల ప్రతిమలు అలరిస్తున్నాయి. పార్క్‌లో భారీ పరిమాణంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటెన్‌ ఆకట్టుకుంటోంది. చుట్టూ నాటిన వివిధ రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

ఎంత పెద్ద ఆ్రస్టిచ్‌ పక్షులో.. 
అర్బన్‌ పార్క్‌కే హైలెట్‌గా ఆ్రస్టిచ్‌ పక్షులు నిలుస్తున్నాయి. పొడవైన కాళ్లు, భారీ ఆకారంతో కూడిన ఆ్రస్టిచ్‌ పక్షులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా అడవుల్లో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి గుడ్డు 32 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. బరువు కిలో 400 గ్రాములు ఉంటుంది.. అన్న వివరాలు ఉన్నాయి. 

మూడు వ్యూ పాయింట్లు 
పార్క్‌లో మూడు వ్యూ పాయింట్లు ఉన్నా యి. హిల్‌ వ్యూపాయింట్, ఫ్లాగ్‌ పాయింట్‌తో పాటు మరో సాధారణ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. హిల్‌ వ్యూపాయింట్‌ నుంచి చూస్తే ఇటు పక్క జడ్చర్ల, మరోపక్క మహబూబ్‌నగర్‌ రహదారి అద్భుతంగా కనిపిస్తోంది. వ్యూ పాయింట్‌లో పార్క్‌ అందాలు ఆకట్టుకుంటున్నాయి. 

ఫొటో షూట్‌లకు క్రేజీ 
మయూరి ఎకో అర్బన్‌ పార్క్‌ ఫొటో షూట్‌కు వేదికగా నిలుస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకునేవారు, చేసుకున్న జంటలు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాల మధ్య ఫొటోలు తీసుకుంటుండడంతో సందడి నెలకొంటోంది.

ఆహ్లాదంగా ఉంది 
సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి పార్క్‌కు వస్తుంటాం. పార్క్‌ రోజురో జుకూ అభివృద్ధి చెందుతోంది. పా ర్క్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతాం. పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. పెద్దలు సంతోషంగా గడిపేందుకు అవకాశముంది.  – రాజేశ్వర్, ఉపాధ్యాయుడు

పిల్లలకు చూపాలి 
చి్రల్డన్‌ పార్కులో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లు, బొమ్మలు కచి్చతంగా పిల్లలకు చూపాలి. సీతాకోక చిలుకల గార్డెన్‌లో రకరకాల మొక్కలు, వాటి పేర్లు తెలియడంతో విజ్ఞానం పెరుగుతుంది. సెలవులు ఉంటే తప్పకుండా మా పిల్లలతో ఇక్కడికొస్తాం.  – శంకర్, మహమ్మదాబాద్‌ 

హైదరాబాద్‌ తరహాలో.. 
హైదరాబాద్‌లోని పార్క్‌ల తరహాలో ఇక్కడే పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పచ్చదనంతో కూడిన పార్క్‌ అందాలు చాలా బాగున్నాయి. జీవితంలో గుర్తుండిపోయేలా ఉంది. పిల్లలకు ఆడుకునేందుకు, విజ్ఞానం పొందేందుకు ఇక్కడి ఏర్పాట్లు బాగున్నాయి.  – దీపిక, మహబూబ్‌నగర్‌ 

రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాట్లు 
ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ ఏర్పాటుతోపాటు రాక్‌ గార్డెన్, కాక్టస్‌ గార్డెన్‌ వంటివి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. త్వరలో ఏర్పాటు చేసి పర్యావరణ విద్యపై శిక్షకుడిని ఏర్పాటు చేసి పార్కుకు వచ్చే సందర్శకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. – వాసవి,  అటవీ సెక్షన్‌ ఆఫీసర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement