ఫిబ్రవరిలోనే మర్చిపోవద్దు
కొత్త ఏడాదిలో కొత్తగా ఉందాం
కొద్దికొద్దిగానైనా మారితే చాలు
హ్యాపీ న్యూ ఇయర్ 2026
2026 జనవరి 1.. కొత్త ఏడాది వచ్చేసింది. ‘న్యూ’ ఇయర్‌లో మనకు నిజంగా కిక్ ఇచ్చేదేమిటి? ‘‘జన వరి 1 నుండి ఇలా ఉండాలి’’ అని గట్టిగా ఒట్టేసు కోవటమే కదా! కానీ ఏమౌతుంది? ఫిబ్రవరి రాగానే.. మాట మీద నిలబడలేక నీరసించి పోతాం. అలాంటి నీరసాలు రాకుండా ఉండాలంటే.. కాస్తంటే కాస్తంత ప్రాక్టికల్‌గా ఉండే చాలు. మీ జీవితంలో ఇది నిజంగానే ‘న్యూ ఇయర్’ అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
జీవితం సినిమా కాదు
జనవరి 1 నుంచి.. ఎవ్వరూ పూర్తిగా వేరే మనిషి అయిపోరు. లైఫ్ అంటే సినిమా కాదు, స్క్రీన్ ప్లే ప్రకారం మొదలవ్వడానికి! ఒక్క అడుగు ముందుకు పడినా అది విజయమే.
సౌండ్ స్లీప్
నిద్ర అంటే కష్టపడి పనిచేశాక, అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదు. బాడీ, మైండ్ అన్నింటికీ అదే ఆధారం. ఉదయం లేవగానే.. ఒక చాట్‌జీపీటీ లేదా జెమినై పనిచేసినట్టు చురుగ్గా పనిచేయాలంటే సౌండ్ స్లీప్ అవసరం. రాత్రి ప్రశాంతంగా పడుకోండి.. ఉదయాన్నే ఫ్రెష్‌గా నిద్ర లేవండి.
‘జలయజ్ఞం’ ఎందుకు?
యాప్‌లతో కొలుచుకుంటూ, అదో ‘జలయజ్ఞం’లా నీళ్లు తాగకండి. స్విచ్చేస్తేనే పని చేస్తాం అన్నట్టు మనం మరీ యంత్రాల్లా తయారైపోతే ఎలా? పక్కనే ఒక వాటర్ బాటిల్‌లో ఉంచుకొని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక సిప్ వేయండి చాలు.
కదలిక సరిపోతుంది
మిమ్మల్ని జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తమని ఎవరన్నారు? ఎవరో జిమ్ చేసేస్తున్నారని మీరు ఫీలైతే ఎవరిది తప్పు? కాసేపు నడవండి. కాస్త ఒళ్లు విరుచుకోండి. ఓ 10 నిమిషాలు ఏదో ఒక పని చేయండి. నిన్నటి కంటే ఈరోజు కాస్త ఎక్కువ కదిలినా అదే పెద్ద సక్సెస్!
వివరణల పురాణం
ఎవరికైనా, ఎందుకైనా ‘నో’ చెప్పటానికి వెయ్యి పురాణాల వివరణ ఇవ్వక్కర్లేదు. సోషల్ మీడియాలో లైకో షేరో కొట్టినంత ఈజీగా ‘నో’ చెప్పేయండి. మొదట ‘గిల్టీ’గా అనిపించినా, ఒకసారి ‘నో’ చెప్పేశాక చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఆన్‌లైన్ యుద్ధాలేల?!
సోషల్ మీడియా యుద్ధాలను ఆపేయండి. ట్రెండింగ్ పోస్టు వైరల్ అయినంత వేగంగా బీపీ పెరగటం తప్ప, అక్కడ గెలిస్తే మీకేమీ ‘ఆస్కార్’ రాదు. కనిపించే ప్రతి పోస్ట్‌కీ, కామెంట్‌కీ సమాధానం చెప్పి మీ టైమ్‌నీ, ఎనర్జీనీ వేస్ట్ చేసుకోకండి.
బండి ‘స్టార్ట్’ చేయండి
కాన్ఫిడెన్స్ వచ్చాకే మొదలుపెడదాం అని వెయిట్ చేయకండి! ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాతే ధైర్యం వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాకే అడుగు వేస్తాను అనుకుంటే, ఉన్నచోటే ఉండిపోతారు.
‘క్యాష్’ ఫీలింగ్
మీరు సంపాదించే ప్రతి రూపాయీ జాగ్రత్త. అలాగని.. తినే తిండిని, ఎంజాయ్‌మెంట్‌నీ కట్ చేయకండి. మీ జేబులోంచి రూపాయి ఎక్కడికి, ఎందుకు వెళ్తుందో గమనించండి. ఆ మాత్రం ‘క్యాష్’ ఫీలింగ్ ఉండాలి.
ఒకటైనా ఫర్‌ఫెక్ట్‌గా..
ఏ పనైనా స్టార్ట్ చేసిన తర్వాత వర్కవుట్ అవ్వట్లేదనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సగం సగం వదిలేసిన పది పనుల కంటే, పర్ఫెక్ట్‌గా పూర్తి చేసిన ఒక్క పని మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.
రక్త పిశాచులకు దూరం!
మీ ఎనర్జీని పీల్చేసే రక్త పిశాచులకు కాస్త దూరంగా ఉండండి! మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోవడం స్వార్థం ఏమీ కాదు, అది ఒక ‘లైఫ్ సేవింగ్’ టెక్నిక్.
వారానికో ఆశ
మన సంతోషాన్ని మనమే షెడ్యూల్ చేసుకోవాలి. ఒక ప్లాన్ ఉందంటే, ‘ఆహా, ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు’ అనే ఆశ ఉంటుంది. ఆ అనుభవం మధురానుభూతిగా మిగులుతుంది. లేదంటే ప్రతి వారం ఒకేలా చప్పగా ఉంటుంది.
వదిలేసి చూద్దురూ..!
పాత పగల్ని, కక్షల్ని, కోపాల్ని పట్టుకుని వేలాడకండి. అవి అనవసర రోగాలు తీసుకొచ్చి ఆసుపత్రులను పోషించడానికి తప్ప ఎందుకూ పనికిరావు. ఒకసారి పగలూ, కోపాలూ ప్రతీకారాలూ వదిలేసి చూడండి, సోషల్ మీడియా కాసేపు స్తంభించిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది.
మీకు మీరే సపోర్ట్
ఎప్పుడూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ, తక్కువ చేసుకుంటూ ఉంటే.. మీ పతనానికి బయట శత్రువులు అవసరమే లేదు. మీకు మీరే సపోర్టింగ్ పిల్లర్. ప్రాంప్ట్ ఇస్తేనే పనిచేసే ఏఐ చాట్‌బాట్‌లా ఉండకండి.
కొత్తగా ఏదైనా..
కొత్త లాంగ్వేజ్ లేదా ఒక కొత్త సాఫ్ట్‌వేర్ లేదా మ్యూజిక్.. ఇలా మీకు నచ్చింది, కొత్తది ఏదో ఒకటి నేర్చుకోండి. టార్గెట్లు అవీ పెట్టేసుకుని.. ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాల్సిన టాస్క్‌లా ఫీల వకండి. మెల్లగా నేర్చుకున్నా సరే, అది నేర్చుకోవడమే.
చెప్పుకొంటే తప్పేంటి
మీకు సలహా కావాలన్నా, కాస్త సపోర్ట్ కావాలన్నా, లేదంటే మీ గోడు వినే మనిషి కావాలన్నా.. మీ సర్కిల్‌లో ఎవరో ఒకర్ని ఎంచుకోండి. మీ బాధలు చెప్పే క్రమంలో.. తనను హింసించకండి. తను కూడా మీలాంటి మనిషే అని గుర్తుంచుకోండి.
మారటం మంచిదే
ఈ ఏడాది మీ ఇష్టాలు మారొచ్చు, కొన్ని లక్ష్యాలు మీకు పనికిరావు అనిపించవచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, మీ ఎదుగుదల! పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకోవడం కూడా అప్‌డేట్ అవటమే.ఇల్లు ‘షోరూమ్’ కాదుమీ ఇల్లేమీ షోరూమ్ కాదు.. తళతళలాడుతూ ఉండాల్సిన అవసరమే లేదు. ఒకే రోజు ఇల్లంతా ఊడ్చి, తుడిచి, సర్ది నడుము విరగ్గొట్టుకోవడం కంటే.. రోజుకి కొంచెంగా క్లీన్ చేసుకోండి. అలాగే మెంటెయిన్ చేయండి చాలు!
క్యాచ్ ద సిగ్నల్స్
మీ బాడీ ఇచ్చే ‘సిగ్నల్స్’ని గమనించండి. అలసట, నొప్పులు.. ఊరికే రావు. అలాగని అన్నింటికీ భయాలూ పెంచుకోకండి. ఓ వయసు దాటాక అవసరమైన టెస్టులు చేయించుకోవ డం.. అత్యవ సరమైతే డాక్టర్లని సంప్రదించడం సర్వ సాధారణం అన్న విషయాన్ని మనసుకు సర్దిచెప్పండి.
సిలబస్ ‘బుక్’ కాదు
మంచి పుస్తకాల్ని చదవడం మంచిదే. కానీ అదేదో ఎగ్జామ్‌లానో సిలబస్ లానో ఫీల్ అవ్వకండి! ఎవరో చదువుతున్నారని మీరు కూడా ఏదో పుస్తకాన్ని కొని.. పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.
అంతిమంగా..
2026లో మీరు ఒక ‘పర్ఫెక్ట్ బొమ్మ’లా ఉండక్కర్లేదు. తప్పులు జరిగితే సరిచేసుకునే.. అలసిపోతే రెస్ట్ తీసుకునే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించే ఒక ‘నిజమైన’ మనిషిగా ఉంటే చాలు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా తడబడినా.. సో వాట్? తిరిగి కొత్తగా మొదలుపెట్టండి. దాని కోసం మళ్లీ జనవరి 1 దాకా ఆగక్కర్లేదు.
ఏదో ఒక మామూలు గురువారం (ఇది మీ ఇష్టం) మధ్యాహ్నం (ఇది కూడా..) 3 గంటలకు (ఇది.. కూడా) మీ లైఫ్‌ని మీరు రీస్టార్ట్ చేయొచ్చు!మీ లైఫ్.. మీ ఇష్టం.. దాన్ని బాగుచేసుకునేందుకు అది మీరు పడే కష్టం. ఆ కష్టం ఎవ్వరూ పడరు.. మీకు కష్టమొస్తే ఎవ్వరూ తీర్చరు. మైండిట్!
హ్యాపీ న్యూ ఇయర్..


