మూడో అత్యుష్ణ ఏడాదిగా 2025 రికార్డు
తక్షణం కళ్లు తెరవాలి: సైంటిస్టులు
అనుకున్నట్టుగానే 2025 పర్యావరణపరంగా మరో అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుని ని్రష్కమించింది. చరిత్రలో అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన మూడో ఏడాదిగా నిలిచింది. నంబర్లపరంగా మూడో స్థానమే అయినా, ప్రపంచవ్యాప్తంగా 2025 పొడవునా అత్యంత తీవ్రతతో కూడిన వాతావరణ మార్పులు పదేపదే చోటుచేసుకుని వణికించాయి.
ముఖ్యంగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల ఉదంతాలు ఏకంగా 157 నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ‘‘ఇవన్నీ పర్యావరణ మార్పుల విపరిణామాలే. ఈ విపత్తును దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలను తక్షణం ముమ్మరం చేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి రావాలి. లేదంటే అంతే సంగతులు. మరో రెండు మూడేళ్ల తర్వాత తత్వం బోధపడ్డా, దిద్దుబాటు చర్యలకు అప్పటికి బాగా ఆలస్యమవుతుంది. అప్పుడిక ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే కాగలదు’’అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పరిమితిని దాటేశాం!
2025 అత్యంత భారీ ఉష్ణోగ్రతలు చవిచూసిన సంవత్సరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిందంటే మనిషి అత్యాశ వల్ల పుట్టుకొచ్చిన పర్యావరణ విపరిణామాల వల్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, గత మూడేళ్ల భూ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటేసింది. ఇలా జరగడం ఇదే తొలిసారి!.
ఇది కచ్చితమైన ప్రమాద సంకేతమేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025లో కేవలం అత్యుష్ణ ప్రతాపాలే కాదు, భయానక తుఫాన్లు, వరదల వంటివి కూడా బెంబేలెత్తించడం గమనార్హం. నిజానికి 2025లో వాతావరణాన్ని సాధారణంగా చల్లబరిచే లా నినా ఆధిపత్యమే కొనసాగింది. అయినా యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోయాయంటే ఆలోచించాల్సిన విషయమేనన్నది నిపుణుల మాట.
‘‘ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకానికి మనం తక్షణం గుడ్‌బై చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే అతి త్వరలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చు’’అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సహ వ్యవస్థాపకుడు, లండన్ ఇంపీరియల్ కాలేజీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో స్పష్టం చేశారు. ‘‘2025లో వచ్చిన పలు వడగాడ్పులు 2015తో పోలిస్తే ఏకంగా 10 రెట్లు శక్తిమంతమైనవి. పైగా ఏడాది పొడవునా అవి పదేపదే సంభవించాయి. ఇదంతా మనిషి కోరి తెచ్చుకుంటున్న విపత్తే’’ అని ఆయన అన్నారు.
ప్రమాదంలో కోట్ల మంది
2025లో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల వాతావరణ పరిస్థితులు అతి వేడిమి నుంచి తీవ్ర వరదలదాక చూస్తుండగానే మారుతూ వచ్చాయి. ‘‘గ్రీస్, టర్కీ మొదలుకుని అమెరికా, ఆ్రస్టేలియా దాకా పలు దేశాల్లో ఎటు చూసినా కార్చిచ్చులు, మెక్సికోను వణికించిన వరదలు, ఫిలిప్పీన్స్‌ను కుండపోత వానలతో ముంచెత్తిన ఫుంగ్ వాంగ్ తుఫాను, భారత్‌లో వానాకాలమంతా ఏదో ఒక ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వరదలు... ఇవన్నీ వాతావరణ మార్పుల విపరిణామాల సంకేతాలే’’ అని ఫ్రెడరిక్ స్పష్టం చేశారు.
‘‘జమైకా, క్యూబా, హైతీ వంటి దేశాలను హరికేన్ మెలిస్సా రెప్పపాటులో అతలాకుతలం చేసింది. కనీసం హెచ్చరికల జారీకి వ్యవధి ఇవ్వకుండా మెరుపు వేగంతో వచ్చి పడింది. ఆ తర్వాత వెంటనే ఆయా దేశాలను ఉష్ణోగ్రతలు అల్లాడించాయి. ఇలాంటి వెంటవెంట మార్పులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులవుతున్నారు. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇది లక్షలాది కుటుంబాలను దారిద్య్రం దిశగా నెడుతోంది. తద్వారా పలు దేశాల్లో నిశ్శబ్దంగా అతి పెద్ద సంక్షోభాలు పురుడు పోసుకునేందుకు కారణంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.
‘శిలాజ’ ముప్పుపై చర్యలేవీ?
ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ చర్చలు ఈ ప్రమాదకర పరిణామాన్నే హైలైట్ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ వారి్మంగ్‌కు ప్రధాన కారకాల్లో ఒకటైన శిలాజ ఇంధనాల వాడకాన్ని శరవేగంగా తగ్గించి, వీలైనంత త్వరగా సున్నాకు తేవాలని తీర్మానించాయి. ‘‘కానీ దేశాలన్నీ ఇలాంటి ప్రమాణాలు ఏటా చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తీరిగ్గా విస్మరిస్తూనే ఉన్నాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు మాత్రం ఎక్కడా పెద్దగా జరగడం లేదు. చైనాయే ఇందుకు ఉదాహరణ. ఒకవైపు సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటూనే, మరోవైపు బొగ్గు గనుల తవ్వకాన్ని కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంతకాలం పర్యావరణ మార్పులపై సమర్థంగా యుద్ధం చేయడం అసాధ్యమే’’ అని ఫ్రెడరిక్ కుండబద్దలు కొట్టారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


