
ఇళ్ళు దగ్ధం, వేలాది మంది తరలింపు
ఏథెన్స్: గ్రీస్‌లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వారంరోజులకు పైగా కొనసాగుతున్న మంటలతో వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏథెన్స్ శివారు ప్రాంతం క్రియోనేరిలో మరో కార్చిచ్చు చెలరేగింది. ఇప్పటికే అనేక ప్రాంతాలను మంటలు చుట్టుముట్టగా.. క్రియోనేరిలోని కార్చిచ్చు వేలాది మందిని ప్రమాదంలో పడేసింది.
ఏథెన్స్‌కు ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న క్రియోనేరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలులతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయి. గ్రీకు జర్నలిస్ట్ ఎవాంజెలో సిప్సాస్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో వినాశకరమైన కార్చిచ్చు దృశ్యాలు కనిపించాయి. ఏథెన్స్‌కు ఉత్తరాన కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని మరో గ్రామంలో పేలుళ్లు సంభవించాయి.
ఆ ప్రాంతంలో కర్మాగారాలు ఉండటంతో మరింత ప్రమాద భయాలు మరింత పెరిగాయి. హెలికాప్టర్లు ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. క్రీట్, ఎవియా, కైథెరా దీవులలో మరో మూడు ప్రధాన కార్చిచ్చులు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు దేశవ్యాప్తంగా 335 అగ్నిమాపక సిబ్బంది, 19 విమానాలు, 13 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. వైమానిక దళాలు పగటిపూట మాత్రమే పరిమితం కావడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. గ్రీసులో ఈ వేసవిలో వేడిగాలులు వీయడం ఇది మూడోసారి. శనివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.