శాంటియాగో: చిలీలో కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటల్లో 18 మంది మృతిచెందారు. వేలాది ఎకరాల అడవి దగ్ధమైంది. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో సుమారు 20 వేల మందికి పైగా ప్రజలు తమ నివాసాలను విడిచివెళ్లినట్లు చిలీ అటవీ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 చోట్ల మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యుబుల్ (Nuble), బయో బయో (BIo BIo) ప్రాంతాల్లో ఈ మంటలు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటివరకు దాదాపు 8,500 హెక్టార్ల (21,000 ఎకరాలు) అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. మంటలు గ్రామాలకు వ్యాపిస్తుండటంతో, ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దాదాపు 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, కనీసం 250 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని చిలీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని, వీటిని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారిందని అధికారులు తెలిపారు. చిలీలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి హెచ్చరికలు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో శాంటియాగో నుండి బయో బయో వరకు ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ (100 F) వరకు చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి చిలీ, అర్జెంటీనా దేశాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులను ఎదుర్కొంటున్నాయి. ఈ నెల ప్రారంభంలో అర్జెంటీనాలోని పటగోనియా ప్రాంతంలో కూడా అడవిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.


