
స్పెయిన్‌లో దేశవ్యాప్తంగా మంటలు
రెండు దశాబ్దాల్లో అత్యంత దారుణమైన వేసవి
మాడ్రిడ్: వాతావరణంలో మార్పులు యూరప్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తుర్కియే, పోర్చుగల్ మంటల బారిన పడగా... స్పెయిన్‌లో కార్చిచ్చు కొనసాగుతోంది. దేశం మొత్తం తీవ్ర కార్చిచ్చు ప్రమాదంలో ఉంది. మంటల్లో ఇప్పటికే 3లక్షల 90 వేల ఎకరాలు దగ్ధమయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 14 చోట్ల కార్చిచ్చులు చెలరేగగా.. ఇప్పుడు 20 ప్రాంతాలకు మంటలు విస్తరించాయి.
మంటలను అదుపు చేసేందుకు మరో 500 మంది సైనికులను ప్రభుత్వం మోహరించింది. వాయువ్య గలిసియా ప్రాంతంలో మంట లను అదుపు చేయడానికి 2వేల మంది అగి్న మాపక సిబ్బంది కష్టపడుతున్నారు. వేడిగాలుల కారణంగా ఎండిపోయిన అడవులన్నీ తగలబడి పోతున్నాయి. రెండు వారాలుగా కొనసాగుతున్న వేడిగాలులతో ఇది రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత దారుణమైన వేసవిగా నమోదైందని అత్యవసర చీఫ్ వర్జీనియా బార్కోన్స్ అన్నారు.
ఇళ్ళకు ఇంకా ముప్పు పొంచి ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలు అదుపు చేస్తున్న చోట వెలువడిన పొ గ, బూడిదను పీల్చకుండా ఉండటానికి ప్రజలు ఫేస్ మాస్‌్కలు ధరించాలని, ఇళ్లనుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ (113 డిగ్రీల ఫారెన్‌హీట్) వరకు చేరే అవకాశం ఉందని స్పెయిన్ జాతీయ వాతావర ణ సంస్థ హెచ్చరించింది.
మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంటలను ఎదుర్కోవడానికి స్పెయిన్‌కు ఫ్రా న్స్, ఇటలీ ఇప్పటికే సహాయం అందిస్తుండగా.. ఇతర యురోపియన్ దేశాలు కూడా సాయమందించనున్నాయి. దక్షిణ యూరప్ రెండు దశాబ్దా లలో ఎన్నడూ లేనంత దారుణమైన కార్చిచ్చు సీజన్‌ను ఎదుర్కొంటోంది. ఇందులో స్పెయిన్ అత్యంత ఎక్కువగా దెబ్బతిన్నది. కార్చిచ్చుతో గత వారంలో ముగ్గురు మరణించారు.
పోర్చుగల్‌లో..
పొరుగున ఉన్న పోర్చుగల్ కూడా మంటలతో పోరాడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 1,550 చదరపు కి.మీ (600 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో కార్చిచ్చులు అటవీ సంపదను దగ్ధం చేశాయి. ఎనిమిది పెద్ద మంటలను వేలాది మంది అగి్నమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన పియోడావో సమీపంలోనూ కార్చిచ్చు చెలరేగింది.
ట్రాంకోసోలో కార్చిచ్చు ఎనిమిది రోజులుగా మండుతోంది. మంటలను అదుపు చేయడానికి 4వేలకు పైగా అగి్నమాపక సిబ్బంది, 1,300 వాహనాలు అలాగే 17 విమానాలను మోహరించింది. 1980ల నుంచి యూరప్ ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు వేగంగా వేడెక్కుతుండటంతో తరచూ కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణాలు మంటల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ప్రాంతం మరిన్ని కార్చిచ్చులకు బలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తుర్కియేలో..
తుర్కియే అడవుల్లోనూ కార్చిచ్చు కొనసాగుతోంది. 30 విమానాలు, 1,300 మంది అగి్నమాపక సిబ్బందితో మంటలను అదుపు చేస్తున్నామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్రీ తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా జూన్ చివరి నుంచే తుర్కియే వందలాది మంటలతో అతలాకుతలమైంది. ఇటీవల చెలరేగిన కార్చిచ్చుల్లో 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఆరు గ్రామాలను ఖాళీ చేయించినట్లు కనక్కలే ప్రావిన్స్ గవర్నర్ ఒమర్ తోరామన్ తెలిపారు.