
చెన్నై: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు తొలి మ్యాచ్‌లో చిలీ జట్టుతో తలపడనుంది. చెన్నై, మదురై వేదికగా మొత్తం 24 దేశాల మధ్య ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్‌తో కలిసి భారత జట్టు పూల్ ‘బి’ నుంచి పోటీపడుతుంది.
ఇక టోర్నీ ఆరంభ రోజే చిలీతో భారత్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజు పాకిస్తాన్‌తో... డిసెంబర్ 2న స్విట్జర్లాండ్ భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా (హెచ్‌ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాం
అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు... భారత్‌కు వస్తుందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత లోపించింది. ఆతిథ్య హోదాలో హాకీ ఇండియా అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.
‘పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా కప్ సమయంలో కూడా పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాం. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారు రాలేదు. జూనియర్ ప్రపంచకప్‌నకు సైతం మా నుంచి అధికారిక ఆహ్వానం పంపించాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ అన్నారు.
చదవండి: Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..?