breaking news
destroyed bulidings
-
గ్రీస్‌లో కార్చిచ్చు విధ్వంసం
ఏథెన్స్: గ్రీస్‌లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వారంరోజులకు పైగా కొనసాగుతున్న మంటలతో వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏథెన్స్ శివారు ప్రాంతం క్రియోనేరిలో మరో కార్చిచ్చు చెలరేగింది. ఇప్పటికే అనేక ప్రాంతాలను మంటలు చుట్టుముట్టగా.. క్రియోనేరిలోని కార్చిచ్చు వేలాది మందిని ప్రమాదంలో పడేసింది. ఏథెన్స్కు ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న క్రియోనేరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలులతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయి. గ్రీకు జర్నలిస్ట్ ఎవాంజెలో సిప్సాస్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో వినాశకరమైన కార్చిచ్చు దృశ్యాలు కనిపించాయి. ఏథెన్స్కు ఉత్తరాన కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని మరో గ్రామంలో పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతంలో కర్మాగారాలు ఉండటంతో మరింత ప్రమాద భయాలు మరింత పెరిగాయి. హెలికాప్టర్లు ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. క్రీట్, ఎవియా, కైథెరా దీవులలో మరో మూడు ప్రధాన కార్చిచ్చులు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు దేశవ్యాప్తంగా 335 అగ్నిమాపక సిబ్బంది, 19 విమానాలు, 13 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. వైమానిక దళాలు పగటిపూట మాత్రమే పరిమితం కావడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. గ్రీసులో ఈ వేసవిలో వేడిగాలులు వీయడం ఇది మూడోసారి. శనివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. -
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..
ఇంఫాల్: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్బాండ్ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. -
'ఒక్కరోజే 48 శిథిల భవనాల కూల్చివేత'
హైదరాబాద్: నగరంలో నేడు ఒక్కరోజే పురాతన, శిథిలావస్థలో ఉన్న 48 ఇళ్లను జీహెచ్ఎంసి టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్లో ఇంత పెద్ద సంఖ్యలో 48ఇళ్లను కూల్చివేయడం రికార్డు అని అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా ఈ పురాతన ఇళ్లు కూలే ప్రమాదం ఉన్నందున నేడు అధిక సంఖ్యలో ఇళ్లను తొలగించినట్టు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి నేటి వరకు కేవలం పది రోజుల వ్యవధిలో 132 పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసినట్టు చెప్పారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 416 భవనాలను కూల్చివేశామని ఆయన తెలిపారు. దీంతో పాటు గత పదిరోజుల్లో పురాతన భవనాలను ఖాళీ చేయాల్సిందిగా చేపట్టిన ప్రత్యేక కౌన్సిలింగ్‌కు అనుగుణంగా నేడు 12 భవనాలను స్వచ్ఛందంగా ఖాళీ చేసి సహకరించారని ఆయన తెలిపారు. ఒక భవనాన్ని సీజ్ చేశామని ఆయన తెలిపారు. నగరంలో పురాతన భవనాలను ఖాళీ చేయించడం, తొలగించడం, పటిష్టపర్చడం తదితర చర్యలను చేపట్టడం వల్ల ఈ వర్షాకాల సీజన్లో ఇళ్లు కూలిన సంఘటనలో ఏవిధమైన ప్రాణనష్టంతో పాటు గాయపడ్డ సంఘటనలు ఇంత వరకు జరగలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.