చరిత్రలో మరో అత్యంత ఉష్ణమయ ఏడాదిగా
రికార్డ్‌లకెక్కనున్న 2025 సంవత్సరం
అసాధారణ భూతాపోన్నతికి ఆజ్యం పోస్తున్న వాతావరణ మార్పులు
ఆందోళన వ్యక్తంచేసిన ప్రపంచ వాతావరణ సంస్థ
న్యూఢిల్లీ: అడవుల నరికివేత మొదలు శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, విపరీతంగా వెలువడుతున్న హరిత ఉద్గారాల దాకా మానవుని ప్రతిచర్యా భూతాపోన్నతికి మరింత ఆజ్యం పోస్తూ చివరకు ఏ ఏడాదిని చరిత్రలోనే అత్యంత ఉష్ణమయ సంవత్సరాల్లో ఒకటిగా మారుస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్లూఎంఓ) ఆందోళన వ్యక్తంచేసింది. ‘‘అత్యంత వేడిమయ సంవత్సరాల జాబితాలో 2025 ఏడాది అనేది త్వరలోనే రెండు లేదా మూడో స్థానంలో కూర్చోబోతోంది.
ఇదే నిజమైతే గత 11 సంవత్సరాలుగా అంటే 2015 ఏడాది మొదలు 2025 ఏడాదిదాకా ఏకధాటిగా 11 ఏళ్లకాలం అత్యంత వేడిగా ఉండటం గత 176 ఏళ్ల నమోదిత గణాంకాల్లో సరికొత్త రికార్డ్’’అని డబ్ల్యూఎంఓ వెల్లడించింది. గత మూడేళ్లుగా భూగోళం అత్యధిక వేడివాతావరణాన్ని చవిచూస్తోందని డబ్ల్యూఎంఓ గురువారం తన ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ అప్‌డేట్’లో పేర్కొంది. ఈ వివరాలతో జర్మనీలో వాతావరణ శాస్త్ర, విధాన నిర్ణయాల సంస్థ ‘క్లైమేట్ అనలైటిక్స్’ఒక నివేదికను రూపొందించి గురువారం విడుదలచేసింది.
పెరిగిన సగటు ఉష్ణోగ్రత
‘‘ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ కాలంలో భూమికి ఆరడుగుల ఎత్తులో ఉపరితల ఉష్ణోగ్రత 1.42 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. ఇది పారిశ్రామిక విప్లవానికి ముందు నాటితో పోలిస్తే భూమిపై సగటు ఉష్ణోగ్రత కంటే అధికం. ఈ శతాబ్దాంతానికి భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ లోపునకు పరిమితం చేయాలని 200 దేశాలు ‘పారిస్ ఒడంబడిక–2015’లో లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. కానీ ఇప్పటికే 1.3 డిగ్రీ సెల్సియస్ సగటును దాటేసి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి’’అని నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. డబ్లూఎంఓ గణాంకాల ప్రకారం అత్యంత ఉష్ణమయ ఏడాదిగా 2024 నిలిచింది. గత ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత చరిత్రలో తొలిసారిగా 1.5 డిగ్రీ సెల్సియస్‌ను దాటింది. ఇక ఏటా 1.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల అనేది 2030కల్లా మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది’’అని నివేదిక అభిప్రాయపడింది.
రెండేళ్ల క్రితం వేడిని పెంచిన ఎల్‌నినో
‘‘వేడిమయ ఎల్ నినో వాతావరణం కారణంగా 2023 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లాయి. ఇది 2024లోనూ కొనసాగి చివరకు 2025లో తటస్థ లేదా లా నినో పరిస్థితులను తీసుకొచ్చాయి. 2024లో పోలిస్తే 2025లో సమీప భూతల ఉష్ణోగ్రతలు కాస్తంత తక్కువగానే నమోదయ్యాయి. 2024లో ఇది 1.55 డిగ్రీ సెల్సియస్‌కాగా ప్రస్తుత సంవత్సరం 1.42 డిగ్రీ సెల్సియస్‌కు దిగొచి్చంది. 2025 ఫిబ్రవరి నెల ఒక్కటి మినహాయిస్తే 2023 జూన్ నుంచి 2025 ఆగస్ట్‌దాకా ఏకధాటిగా 26 నెలలపాటు ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతూ వచి్చంది. రెండేళ్లు కొనసాగిన లా నినా తర్వాత ముగిసి గత మూడేళ్లుగా ఎల్‌నినో పరిస్థితులు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వీటికి హరిత ఉద్గారాల గాఢత, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత తోడయ్యాయి’’అని డబ్ల్యూఎంఓ తెలిపింది.
ఆర్కిటిక్‌లో తగ్గుతున్న మంచు
‘‘చలికాలం తర్వాత ఆర్కిటిక్ సముద్రమంచు విస్తీర్ణం రికార్డ్‌స్థాయిలో కనిష్టానికి పడిపోయింది. అంటార్కిటిక్ సముద్ర మంచు మాత్రం ఏడాదంతా సగటు కంటే తక్కువగా నమోదైంది. విపరీతమైన వాతావరణ మార్పుల పోకడ కారణంగా ప్రపంచ దేశాల్లో కుంపోత వర్షాలు, వరదలు, కరువు, కార్చిచ్చు ఘటనలు సర్వసాధారణమయ్యాయి. దీంతో జనాభా, ఆవాసం, ఉపాధది వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇవి సుస్థిరాభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి’’అని నివేదిక పేర్కొంది. నవంబర్ 10వ తేదీ నుంచి బ్రెజిల్‌లోని బెలెమ్ నగరంలో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో నివేదికలోని వివరాలు వెల్లడయ్యాయి.


