ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు కుట్ర
మృతుడి సోదరుడి తీవ్ర ఆరోపణలు
యూనస్ ప్రత్యేక సలహాదారు ఖుదా బక్ష్ రాజీనామా
ఢాకా: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన అతివాద విద్యార్థి నేత షరీఫ్ ఒస్మార్ హదీ సోదరుడు మహ్మద్ యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనస్ ప్రభుత్వంలోని ఒక వర్గం దేశంలో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించేందుకు కుట్ర పన్నిందని, అందులో భాగంగానే హాదీని చంపించిందని ఆరోపించారు.
హాదీ సోదరుడు ఒమర్ హాదీ ఇంక్విలాబ్ మంచ్ సారథ్యంలో జరిగిన ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ.. ‘హాదీ మృతికి మీరే కారణం. ఇదే సాకుతో సాధారణ ఎన్నికలను భగ్నం చేసేందుకు ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఒస్మాన్ హాదీ హత్య ఘటనపై బాధ్యత నుంచి తప్పించుకోలేరు’అంటూ ఆపద్ధర్మ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపా రు. హాదీ హత్యకు జరిగిన కుట్రను, కారకులను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
‘లేకుంటే దేశం నుంచి మిమ్మల్ని కూడా గెంటివేయక తప్పదు’అంటూ హెచ్చరించారు. గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలేందుకు హాదీ సారథ్యంలో జరిగిన ఇంక్విలాబ్ మంచ్ ఆందోళనలే కారణం. కాగా, ఒమర్ హాదీ ఆరోపణల నేపథ్యంలో హోం శాఖకు సంబంధించి యూనస్‌కు ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న మహ్మద్ ఖుదా బక్ష్ చౌదరి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు బుధవారం రాత్రి ఆమోదించారు.
వారి ఆచూకీ తెలిపితే బహుమానం
చిట్టోగ్రామ్‌లోని రావ్‌జాన్ ఏరియాలో మంగళవారం రాత్రి ఓ హిందువు ఇంటికి నిప్పంటించిన దుండగులు ఆచూకీ తెలిపిన వారికి బహుమానం అందజేస్తామని చిట్టోగ్రామ్ రేంజ్ పోలీస్ చీఫ్ అహ్సాన్ హబీబ్ ప్రకటించారు. ఖతార్‌లో ఉండే సుఖ్ షిల్, అనిల్ షిల్‌ల ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు.
దుండగులు బయటి నుంచి తలుపులకు తాళాలు వేయడంతో లోపలున్న రెండు కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది పైకప్పును తొలగించుకుని, ఎలాగోలా సురక్షితంగా బయటపడ్డారు. ఇదే ప్రాంతంలోని పలు హిందువుల ఇళ్లపై దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో గత ఐదు రోజుల వ్యవధిలో హిందువులకు చెందిన ఏడిళ్లకు నిప్పుపెట్టారని మీడియా తెలిపింది. ఈ ఘటనలకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


