అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెరైటీగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నైజీరియాపై అగ్రరాజ్య సైన్యం దాడులు జరిపిందని.. చచ్చిన ఉగ్రవాదులతో పాటు ప్రజలందరికీ మెరీ క్రిస్మస్ అంటూ ప్రకటన చేశారు. ఆ దేశ వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తీవ్ర దాడులు జరిపిందని ఆ ప్రకటనలో ఆయన తెలియజేశారు. ట్రంప్ తన సోషల్ ట్రూత్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
‘‘అమెరికా సైన్యం నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలో ఐసిస్(ISIS) ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ఉగ్రసంస్థ గత కొంతకాలంగా హత్యలు చేస్తోంది. ముందే హెచ్చరించినా కూడా ఆ ఊచకోత ఆగలేదు. అందుకే ఈ దాడులు జరిపాం’’ అని అన్నారాయన. అమెరికా మాత్రమే చేయగలిగే పరిపూర్ణ దాడులు జరిగాయని.. తన నాయకత్వంలో తీవ్రవాదాన్ని అణచివేస్తామని.. ఈ సందర్భంగా అమెరికా సైన్యానికి కృతజ్ఞతలంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారాయన. అయితే దాడుల తదనంతర పరిణామాలపై మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.
నైజీరియా జనాభాలో ఉత్తర భాగంలో మస్లింలు, దక్షిణ భాగంలో క్రిస్టియన్లు ఎక్కువ సంఖ్యలో స్థిరపడిపోవడంతో.. మతాల మధ్య తరచూ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఐసిస్ సంస్థ.. అనుబంధ గుంపులు, అలాగే బోకో హరామ్ వంటి తీవ్రవాద సంస్థలు హింస కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో.. రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు, మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరం, ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యాలతో.. అమెరికా ఇటీవల నైజీరియాను ఆందోళన దేశాల జాబితాలో(country of particular concern) చేర్చింది.
సీపీసీ అంటే.. కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్(CPC) జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందిస్తారు. ప్రస్తుతం.. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
గత కొన్నేళ్లుగా క్రైస్తవులపై నిషేధిత సంస్థల హింస తీవ్రతరం అయ్యిందని ట్రంప్ ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అంతేకాదు.. క్రైస్తవులపై జరుగుతున్న హింస కారణంగా నైజీరియా పౌరులపై వీసా పరిమితులు కూడా విధించారు..
నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను అని తెలిపారు. చెప్పినట్లే ఇప్పుడు వైమానిక దాడులు జరిపించారు.
.@POTUS “Tonight, at my direction as Commander in Chief, the United States launched a powerful and deadly strike against ISIS Terrorist Scum in Northwest Nigeria, who have been targeting and viciously killing, primarily, innocent Christians, at levels not seen for many years, and… pic.twitter.com/ct7rUW128t
— Department of War 🇺🇸 (@DeptofWar) December 26, 2025
మరోవైపు.. అమెరికా చర్యలను నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు పరోక్షంగా ఖండించారు. క్రైస్తవులపై వ్యవస్థీకృత హింస జరుగుతోందనే ఆరోపణలను తిరస్కరించింది. ఉగ్రవాదులు ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకుంటారని, సమస్య క్లిష్టమైందని పేర్కొంది. దేశంలో మత స్వేచ్ఛను కాపాడతానని.. అన్ని మతాల ప్రజలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నానని బోలా తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. మొత్తం మీద అమెరికా-నైజీరియా మధ్య ఉగ్రవాదంపై చర్యలు, మత స్వేచ్ఛ రక్షణపై ప్రకటనలు హాట్ టాపిక్‌గా మారాయి.


