కెనడా టోరంటోలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత్ విద్యార్థి ఒకరు మరణించారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తాజాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది జాత్యంహకార హత్య.. మరేదైనా కారణమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
శివాంక అవస్థీ(20) స్థానిక యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ స్టూడెంట్. అయితే క్యాంపస్ ఆవరణలో మంగళవారం కాల్పలు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకునేలోపే నిందితులు పారిపోయారు. సంఘటన హైలాండ్ క్రీక్ ట్రైల్-ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో జరిగిందని.. బుల్లెట్ గాయాలతో శివాంక అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు.
టోరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. ఈ ఘటనపై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ మూడో ఏడాది చదువుతున్న శివాంక్ అవస్థీని పట్టపగలే కాల్చి చంపారని.. ఇది దర్మార్గమని ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్‌లో భద్రతా లోపాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిత్యం విద్యార్థుల సంచారం ఉంటుందని.. ఇకనైనా భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. శివాంక్ అవస్థీ యూనివర్సిటీ చెర్‌లీడింగ్ టీమ్ సభ్యుడు కూడా. ఆయన మరణంపై జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళి అర్పించింది.
భారత కాన్సులేట్ జనరల్ (టొరంటో) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అవస్థీ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ కుర్రాడి నేపథ్యం.. ఇతర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
టోరంటోలో తాజాగా హిమాంశి ఖురానా(30) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అబ్దుల్ ఘఫూరి అనే వ్యక్తిని పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇది ‘‘ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్’’ కేసు అని అధికారులు పేర్కొన్నారు. అటు హిమాంశి కుటుంబానికి కూడా భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. టొరంటోలో వరుస హింసాత్మక ఘటనలు భారతీయ కమ్యూనిటీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇదీ చదవండి: భారతీయులకు ఆ దేశాల్లో భద్రతే లేదా?..


