
చిక్కబళ్లాపురం: అండగా ఉంటానని వితంతువును పెళ్లి చేసుకొని గర్భిణిని చేసిన వ్యక్తి మరో వివాహం చేసుకున్నాడు. న్యాయం చేయాలని వెళ్లిన మొదటి భార్యపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. చిక్కబళ్లాపురం నగరంలో నివాసముంటున్న కీర్తి భర్త 2022లో మృతి చెందాడు. ఈ దంపతులకు కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనులకు వెళ్లేది. అక్కడ అంబిగానహళ్లికి చెందిన సునీల్‌తో పరిచయమైంది.
అనంతరం ఇద్దరూ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. రిజి్రస్టార్ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేయించారు. కొద్ది రోజులు వీరి కాపురం సవ్యంగా సాగింది. అనంతరం సునీల్ గొడవ పడుతుండగా పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు మందలించడంతో కీర్తిని బాగా చూసుకుంటానని హామీ పత్రం రాసిచ్చాడు. ప్రస్తుతం కీర్తి ఎనిమిది నెలల గర్భిణి. అయితే సునీల్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అంబిగానహళ్లిలోని సునీల్ ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు దాడి చేశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి కీర్తిని ఆస్పత్రికి తరలించారు.