
కుటుంబ పోషణ మరిచిన ప్రభుత్వ ఉద్యోగి
మనోవేదనతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టర్ ఉత్తర్వులు జారీ
పెద్దపల్లిరూరల్: పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్నబిడ్డలను పట్టించుకోని భర్తకు సఖి కేంద్రం నిర్వాహకులు కౌన్సెలింగ్‌కు యతి్నంచినా సహకరించలేదు. ఆగ్రహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాలరావు బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన రవీందర్ (ఓదెల పీహెచ్‌సీలో ఫార్మసిస్ట్) కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా పరాయి స్త్రీ మోజులో పడిన రవీందర్.. భార్యాబిడ్డల పోషణ పట్టించుకోవడం మానేశాడు. పోషణ భారం కావడంతో ఆయన భార్యాపిల్లలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబంతో కలిసి ఉండేలా చూడాలని జిల్లా సంక్షేమశాఖ, సఖి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
వారు పలుమార్లు కౌన్సెలింగ్ పిలిచినా సహకరించలేదు. ఉద్యోగం చేసే పీహెచ్‌సీకి వెళ్తే.. “మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో సహజీవనం చేస్తే తప్పేంటి’ అని దబాయించాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లొచ్చంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించారు. ఆగ్రహించిన కలెక్టర్.. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి చట్టం ప్రకారం రవీందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.