
బీఏఎస్–01 నమూనా ఆవిష్కరించిన ఇస్రో
మన అంతరిక్ష ప్రస్థానంలో కీలక మైలురాయి
అమెరికా, రష్యా, చైనా సరసన భారత్
మూడేళ్లలో ప్రయోగించాలన్నది లక్ష్యం
దేశీయంగానే బీఏఎస్ తయారీ
ఇదేమిటో తెలుసా? రోదసిలో మన దేశాన్ని అమెరికా, రష్యా, చైనా సరసన నిలిపే ప్రతిష్టాత్మక భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) తొలి నమూనా! దేశమంతా చిరకాలంగా ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న ఈ బీఏఎస్–01ను భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) శుక్రవారం సగర్వంగా ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇందుకు వేదికైంది. దేశీయంగా రూపకల్పన చేసిన బీఏఎస్ తొలి మాడ్యూల్ (01)ను 2028 కల్లా భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో కృషి చేస్తుండటం తెలిసిందే. 2035కల్లా దాన్ని ఐదు మాడ్యూళ్లకు విస్తరించాలన్నది లక్ష్యం. – న్యూఢిల్లీ
ఎన్నో విశేషాలు.. బీఏఎస్–01
⇒ బరువు 10 టన్నులు
⇒ పొడవు 8 మీటర్లు
⇒ వెడల్పు 3.8 మీటర్లు
⇒ దీన్ని భూమికి 450 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు
⇒ అంతరిక్షంలో స్పేస్–లైఫ్ సైన్సెస్, ఔషధ, గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనుంది.
⇒ వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్ పూర్తిస్థాయిలో కాలూనేందుకు వీలు కల్పించనుంది.
⇒ అంతరిక్ష పర్యాటకంతో పాటు అంతర్జాతీయ సహకారాలకు వేదిక కానుంది.
⇒ స్పేస్ టెక్నాలజీ, రీసెర్చ్‌ను కెరీర్‌గా మలచుకునేలా భావి తరాలకు స్ఫూర్తినివ్వనుంది.
⇒ ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్, లైఫ్ సపోర్ట్ సిస్టం (ఈసీఎల్‌ఎస్‌ఎస్), భారత్ డాకింగ్ సిస్టం, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హాచ్ సిస్టం వంటి హంగులెన్నో దీని సొంతం.
⇒ ఇవన్నీ పూర్తిగా దేశీయంగా తయారు చేసుకున్న ఫీచర్లే కావడం విశేషం.
⇒ అంతరిక్షంలో మనుషుల ఆరోగ్యంపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావంతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రీయ ఇమేజింగ్ తదితరాలు బీఏఎస్‌లో జరగనున్నాయి.
⇒ రోజువారీ కార్యకలాపాలకు తోడు రీఫిల్లింగ్ ప్రొపల్లెంట్, ఈసీఎల్‌ఎస్‌ఎస్ ఫ్లూయిడ్లు, రేడియేషన్, థర్మల్ ప్రభావం, మైక్రో మీటరాయిడ్ ఆర్బిటల్ వ్యర్థాల (ఎంఎంఓడీ) నుంచి రక్షణ తదితరాలకు అవసరమైన హంగులన్నీ బీఏఎస్‌లో ఉండనున్నాయి.
⇒ స్పేస్ సూట్లు, ఎయిర్ లాక్స్, ప్లగ్ అండ్ ప్లే తరమా ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వ్యవస్థలకు దన్నుగా నిలుస్తుంది.
ఆ దేశాల సరసన...
బీఏఎస్–01 భారత్‌ను సొంత అంతరిక్ష కేంద్రాలున్న అమెరికా, రష్యా, చైనా సరసన నిలపనుంది. అయితే ప్రస్తుతం రెండే అంతరిక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి. మొదటిది అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ స్పేస్ స్టేషన్.
⇒ గతంలో తొలుత అమెరికా, అనంతరం సోవియట్ యూనియన్ (యూఎస్‌ఎస్‌ఆర్–ప్రస్తుత రష్యా) సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి.
⇒ అమెరికా స్కైలాబ్ పేరిట, యూఎస్‌ఎస్‌ఆర్ మిర్ పేరిట అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి.
⇒ ఇటీవల టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మించిన చైనా అంతకుముందు టియాంగాంగ్–1, టియాంగాంగ్–2 పేరుతో మాడ్యూళ్లను ఏర్పాటు చేసుకుంది.