
ఉక్రెయిన్ వ్యాప్తంగా భీకర దాడులు
కీవ్: రష్యా మరోసారి భీకర గగనతల దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం రాత్రి ఏకంగా 574 డ్రోన్లు, మరో 40 వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య పరమైన ప్రయత్నాలు ఊపందుకున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా రష్యా చేపట్టిన ఈ దాడుల్లో ఎక్కువగా జనావాసాలకు నష్టం జరిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాదిలో రష్యా జరిపిన మూడో అతిపెద్ద డ్రోన్ దాడి, 8వ క్షిపణి దాడి ఇదని వివరించింది.
ఈ దాడుల్లో కనీసం ఒకరు చనిపోగా 15 మంది గాయపడ్డారంది. పశి్చమ దేశాలు అందించిన ఆయుధ సామగ్రి గోదాములు, ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. కొన్ని క్షిపణులు హంగరీ సరిహద్దులకు సమీపంలో పడ్డాయని, అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఒకటి ధ్వంసమైందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో దాడి కారణంగా ఆరుగురికి గాయాలైనట్లు వెల్లడించారు. లీవ్ నగరంపై జరిగిన దాడిలో 26 నివాస భవనాలు దెబ్బతిన్నాయన్నారు.