ఇది దుస్సాహసాల యుగం | Sakshi Guest Column On War Situations | Sakshi
Sakshi News home page

ఇది దుస్సాహసాల యుగం

Jun 23 2025 12:30 AM | Updated on Jun 23 2025 12:30 AM

Sakshi Guest Column On War Situations

విశ్లేషణ

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. 

అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ భద్రత మీద, ఉక్రెయిన్‌ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్‌ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. 

మరింత ఉక్రెయిన్‌ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్‌ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్‌ను పురిగొల్పి ఉంటుంది. 

దుస్సాహసం ఫలిస్తుంది!
గాజా మీద ఇజ్రాయెల్‌ దురాక్రమణకు దిగింది. హమాస్‌ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. 

ఇజ్రాయెల్‌ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్‌ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!

అయితే ఇజ్రాయెల్‌ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్‌ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌ ఈ పోరులో విజయం సాధించింది. 

హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్‌ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్‌ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. 

పుతిన్‌ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్‌ వారెంటును పట్టించుకోలేదు. 

పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.

ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...
వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్‌ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్‌లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్‌ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. 

సౌత్‌ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్‌తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. 

ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. 

అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్‌’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్‌ను ఆక్రమించుకోగలనని జిన్‌పింగ్‌ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. 

ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్‌పింగ్‌ కూడా  అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనాను హస్తగతం చేసుకున్నాడు. 

దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్‌ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్‌పింగ్‌ను పురిగొల్పి ఉంటుంది. 

ఉగ్రవాద దుస్సాహసం
ఏప్రిల్‌ 22న పాకిస్తాన్‌ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్‌ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్‌ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.

అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్‌ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్‌ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. 

జిన్‌పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్‌ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. 

అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్‌కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్‌ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు.  

మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్‌) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. 

మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.

ప్రశాంత్‌ ఝా 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, పొలిటికల్‌ ఎనలిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement
 
Advertisement
Advertisement