
చిన్నస్వామి స్టేడియం (ఫైల్)
మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దక్కని అనుమతి
నవీ ముంబైకి మ్యాచ్‌ల తరలింపు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ వేదికల జాబితా నుంచి బెంగళూరును తొలగించారు. ఇక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి తరలించారు. టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న భారత్, శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్‌తో పాటు మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణకు బెంగళూరు పోలీసుల నుంచి అనుమతి పొందడంలో కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) విఫలమైంది.
ఐపీఎల్–2025లో విజేతగా నిలిచిన అనంతరం జూన్ 4న ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిర్వహించిన సంబరాల్లో ప్రమాదవశాత్తూ 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన దర్యాప్తులో ఆర్‌సీబీ యాజమాన్యాన్ని, కేఎస్‌సీఏను తప్పు పట్టిన కమిటీ... చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌లు నిర్వహించేదుకు సురక్షితం కాదని తేల్చింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అధికారులు ఈ స్టేడియానికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు.
ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్ కోసం అనుమతి సాధించడం అసాధ్యంగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేఎస్‌సీఏ హామీ ఇచ్చినా పోలీసులు స్పందించలేదు. ఇదే కారణంతో ఇంతకు ముందే అసోసియేషన్ తమ ఫ్రాంచైజీ టోర్నీ మహరాజా ట్రోఫీని బెంగళూరు నుంచి మైసూరుకు తరలించింది. తాజా పరిణామాలన్నీ ఐసీసీ మ్యాచ్‌ల నిర్వహణా నిబంధనలకు ప్రతికూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి మ్యాచ్‌లు తరలించాల్సి వచ్చింది.
బెంగళూరులో సాధ్యం కాకపోతే తాము తిరువనంతపురంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని కేరళ సంఘం ముందుకు వచ్చినా... అక్కడి నుంచి ప్రధాన నగరాలకు తగినన్ని ఫ్లయిట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టారు. డీవై పాటిల్ స్టేడియంలో సెమీఫైనల్‌తో పాటు పాక్ అర్హత సాధించకపోతే ఫైనల్‌ను కూడా నిర్వహిస్తారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి నవీ ముంబైతో పాటు విశాఖపట్నం, గువహటి, ఇండోర్, కొలంబో ఆతిథ్యం ఇస్తాయి.