విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్‌మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్‌లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్‌లోని ఓ మాల్‌లో కలిశాడు.
ఆ పరిచయంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్‌లు పంపాడని ఆధారాలతో (చాట్ స్క్రీన్‌షాట్లు) సహా సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
లీకైన ఈ చాట్‌ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ బ్రాండ్‌కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు.
గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌పై ఘాజియాబాద్, జైపూర్‌లో కేసులు నమోదయ్యాయి. యశ్ దయాల్ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది.
తాజాగా చికారా ఎపిసోడ్ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్ ఇమేజ్ కలిగిన ఆర్సీబీ దయాల్, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్‌ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది.
చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్‌లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన చికారా విరాట్ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్‌ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.
మొత్తంగా యశ్ దయాల్, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.
కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్‌లోనే తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌పై జయకేతనం ఎగురవేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లికి అంకితమిచ్చారు.
ఈ గెలుపుతో విరాట్ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు.


