బెంగళూరు: బసవేశ్వర నగరలో గతనెల 24న చోటు చేసుకున్న బ్యాంక్ మహిళా ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగు చూసింది. భార్యను పిస్తోలుతో కాల్చేందుకు భర్త బాలమురుగన్ బిహార్‌లో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు మాగడిరోడ్డు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. బాలమురుగన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు.
దంపతుల మధ్య విభేదాలు రావడంతో భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వేరే ఇంట్లో నివాసం ఉంటోంది. భార్యను హత్య చేయాలని భావించిన బాలమురుగన్ బిహార్‌కు వెళ్లి అక్కడ ఓ వ్యక్తితో రూ.50 వేలకు పిస్తోల్ కొనుగోలు చేసి 15 రోజుల పాటు అక్కడే మకాం పెట్టి గన్ ఫైరింగ్‌పై శిక్షణ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. గతంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి భార్య హత్యకు రూ.1.25 లక్షలు సుపారీ ఇచ్చాడు. అయితే సుపారీ కిల్లర్ ఆమెను హత్యచేయకుండా వెనక్కి వచ్చేశాడు. దీంతో బాలమురుగన్ గతనెల 24 తేదీన నడిరోడ్డులో భార్యపై పిస్తోల్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు.


