
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.
రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.
కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.