
ఈ ధోరణి న్యాయవ్యవస్థను దెబ్బతీస్తుంది
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషుమి భట్టాచార్య
ఓ కేసులో ముగ్గురి క్షమాపణలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులపై విమ ర్శలు చేయడం, దూషించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిందని హైకోర్టు న్యాయ మూర్తి జస్టిన్ మౌషుమీ భట్టాచార్య ఆవేదన వ్యక్తంచేశారు. అసంతృప్తికి గురైన న్యాయ వాదులు, క్లయింట్లు జడ్జీలపై ఆరోపణలు చేయడమే కాకుండా కేసు విచారణ నుంచి తప్పుకోవాలని బెదిరించే స్థాయికి దిగజారుతు న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని, అనిశ్చితికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కేసులో ముగ్గురి క్షమాపణలను అనుమతిస్తూ న్యాయ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై గతంలో నమోదైన అట్రాసిటీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మౌషుమి భట్టాచార్య వివక్షతో వ్యవహరించారని పిటిషనర్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. దానిని అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 11న కొట్టివేసింది. పిటిషనర్‌తోపాటు ఆయన తరఫు న్యాయవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. జస్టిస్ మౌషుమి భట్టాచార్యకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ మౌషుమి భటాచార్య ధర్మాసనం ముందు శుక్రవారం పెద్దిరాజు, రితీశ్‌పాటిల్, నితిన్ మేష్రమ్ భేషరతుగా క్షమాపణ చెప్పారు. అప్పీల్‌లో వాడిన భాషకు చింతిస్తున్నామని తెలిపారు. ఆ అఫిడవిట్‌ను న్యాయమూర్తి అనుమతించారు.
న్యాయమూర్తులకు వేదిక లేదు
తనపట్ల సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరుకు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య కృతజ్ఞత తెలిపారు. జడ్జీలపై దాడులు చేసేవారు ఇష్టారాజ్యంగా మీడియాలో ఒక క్లిక్‌తో ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తన వాదన వినిపించేందుకు సంబంధిత న్యాయమూర్తికి వేదికే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాన్ని కాపాడటంలో జడ్జీలది కీలక పాత్ర అని, వారిపై దాడులు కోర్టుల గౌరవానికి భంగం కలిగిస్తాయని అన్నారు. న్యాయమూర్తి పదవి అంటే చైర్మన్ అధికారం కాదని.. మనస్సాక్షి, నిబద్ధత, కరుణతో న్యాయం అందించే బాధ్యత అని స్పష్టంచేశారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కోర్టులు న్యాయం అందించడంలో పతాకధారులుగా నిలుస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.