
నిన్నగాక మొన్న ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. హఠాత్తుగా స్వరం మార్చారు. ఆరెస్సెస్ గీతాన్ని.. అదీ అసెంబ్లీలో సభ్యులందరి సమక్షంలో ఆలపించారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు బళ్లలు చరుస్తూ ఆయన్ని ప్రొత్సహించగా.. ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ సభ్యులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారు. బెంగళూరు ఆర్సీబీ వేడుకల్లో తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్లు, సెటైర్లు కనిపిస్తున్నాయి.
చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు శివకుమారే బాధ్యుడంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. అయితే బెంగళూరు ఇంచార్జి మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ సభ్యుడి హోదాలో ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. ప్లేయర్లను అభినందించి కప్‌ను ముద్దాడాక అక్కడితో తనతోనే తన పని అయిపోయిందని అన్నారాయన. అదే సమయంలో ఇలాంటి ఘటనలు వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయని గుర్తు చేశారు.
VIDEO | Karnataka Deputy CM DK Shivakumar (@DKShivakumar) recited the RSS’ Sangha Prarthana, ‘Namaste Sada Vatsale Matribhume’, while addressing the Assembly yesterday.
(Source: Third party)
(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2CNsemZaq4— Press Trust of India (@PTI_News) August 22, 2025
దీంతో.. ఆ సమయంలో, ప్రతిపక్ష నేత ఆర్. అశోక గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్ చెడ్డీ (RSS యూనిఫాం) వేసుకున్నానని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనికి స్పందనగా శివకుమార్ ఆరెస్సెస్ గీతం “నమస్తే సదా వత్సలే మాతృభూమే…” పాడారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘‘ఈ లైన్లు రికార్డుల నుంచి తొలగించవద్దని ఆశిస్తున్నా’’ అని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలా స్పందిస్తారు?.. ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే ఈ పాటికే కాంగ్రెస్ చర్యలు తీసుకునేదేమో అని ఒకరు కామెంట్ చేస్తే.. అర్జంట్‌గా డీకేఎస్‌కు సీఎం పీఠం అప్పజెప్పకపోతే కాంగ్రెస్ చీలిపోయే ప్రమాదం ఉందని మరొకరు.. ఇది నిజంగానే షాకింగ్ రాజకీయ పరిణామమని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే.. చర్చ తీవ్రతరం కావడంతో డీకే శివకుమార్ తన చర్యపై స్పందించారు.
నేను జన్మతః కాంగ్రెస్ వాదిని. ఒక రాజకీయ నేతగా స్నేహితులు, ప్రత్యర్థులు ఎవరో తెలుసుకోవడం నాకు అవసరం. నేను వాళ్లను అధ్యయనం చేశాను. బీజేపీతో చేతులు కలపడం అనే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం.. నాయకత్వం వహిస్తాను. జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను అని స్పష్టత ఇచ్చారాయన.
ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ఆరెస్సెస్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు స్పందించగా.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ఒక సంస్థగా ఉన్నా, దాని నైతికతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నారు.అయితే కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఆరెస్సెస్‌తో పోల్చలేనిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఆరెస్సెస్ చాలా కాలం జాతీయ జెండాను ఎగురవేయలేకపోయిందని, వాజ్‌పేయి ముందడుగు వేసిన తర్వాతే అది సాధ్యమైంది వ్యాఖ్యానించారు.