
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.
ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్‌కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..
డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడం
నాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడం
పశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు
ఉక్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?
వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్‌లో ఉక్రెయిన్‌కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్‌లో మోహరించకూడదు.
కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్‌లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్‌స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్‌లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్‌లో 73% రష్యా నియంత్రణలో ఉంది.
అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.
ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.
డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్‌కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్‌కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.
అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్‌కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
అస్పష్టతలు & అడ్డంకులు
ఉక్రెయిన్ డోన్బాస్‌ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.
అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.
జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.
ట్రంప్ పాత్ర
ఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్‌స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు.