
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో శుక్రవారం భారత్‌కు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తమిళనాడుకు చెందిన ఇలవేనిల్ వలారివన్ భారత్‌కు పసిడి పతకాన్ని... ఇలవేనిల్, మెహులీ ఘోష్, అనన్య నాయుడులతో కూడిన బృందం కాంస్య పతకాన్ని అందించింది. స్కీట్ మిక్స్‌డ్ విభాగంలో గనీమత్ సెఖోన్–అభయ్ సింగ్ సెఖోన్ జోడీ భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని జమ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో 26 ఏళ్ల ఇలవేనిల్ 253.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.
ఈ క్రమంలో ఇలవేనిల్ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. 2019 నుంచి అపూర్వీ చండేలా (భారత్; 252.9 పాయింట్లు) పేరిట ఉన్న ఆసియా రికార్డును ఇలవేనిల్ సవరించింది. భారత్‌కే చెందిన మెహులీ ఘోష్ 208.9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. టీమ్ విభాగంలో ఇలవేనిల్ (630.7 పాయింట్లు), మెహులీ (630.3 పాయింట్లు), అనన్య (630 పాయింట్లు) మొత్తం 1891 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
స్కీట్ మిక్స్‌డ్ కాంస్య పతక మ్యాచ్‌లో గనీమత్–అభయ్ ద్వయం 39–37తో అబ్దుల్లా అల్‌రషీది–అఫ్రా (కువైట్) జంటపై నెగ్గింది. మరోవైపు మహిళల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో శాంభవి, హృదయశ్రీ, ఇషాలతో కూడిన భారత జట్టు 1896.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో హర్‌మెహర్ సింగ్–యశస్వి రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది.