
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా ఎన్నిౖకైన సమయంలో 2018–19 సంవత్సరాల్లో జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ నివాసంపై ఎఫ్‌బీఐ అధికారులు దాడులు జరిపారు. మేరీల్యాండ్‌లోని బెథెస్డాలో ఉన్న బోల్టన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు ధ్రువీకరించారు. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
రహస్య పత్రాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే సోదాలు చేపట్టినట్లు మీడియా అంటోంది. వాషింగ్టన్ డీసీలోని బోల్టన్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయని తెలిపింది. అప్పటి ట్రంప్ పాలనపై బోల్టన్ 2020లో ఒక పుస్తకం రాశారు. ఇందులో ట్రంప్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పుస్తకంలోని పలు అంశాలను అధికార రహస్య పత్రాల ద్వారానే బోల్టన్ పొందినట్లు ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. దాడులపై బోల్టన్ స్పందించలేదు. దాడుల విషయంతనకు తెలియదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.