Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Speaker Ayyannapatrudu Comments On AP Police1
పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్‌ అయ్యన్న

సాక్షి, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌పై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దొండపూడి గ్రామ దేవత పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, స్పీకర్‌ వెళ్లే సమయంలో పక్కన ఎస్కార్ట్‌ లేకపోవడంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్పీకర్‌ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Jayalalithaa Really Want Vijay's Rival Ajith Kumar2
Tamil Nadu: విజయ్‌కు ప్రత్యర్థిగా అజిత్‌? జయలలిత ఇదే కోరుకున్నారా?

చెన్నై: తమిళనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. 2026లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. తమిళ అగ్ర నటుడు విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) పోటీ చేస్తుందని ప్రకటించిన దరిమిలా తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో విజయ్‌ ప్రత్యర్థిగా భావిస్తున్న మరో తమిళ హీరో అజిత్ కుమార్ రాజకీయ ‍ప్రవేశంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.అజిత్ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2016లో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మరణించాక అజిత్‌ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన పలు వార్తలు వినిపించాయి. నాడు జయలలిత తన పార్టీ ఏఐడీఎంకేలోకి అజిత్ తన వారసునిగా రావాలని కోరుకుంటున్నారనే వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించి, స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, అజిత్‌ ఈ విషయమై ఎప్పుడూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ఈ ఊహాగానాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత నాడు ఒక నటునిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఒక జర్నలిస్టు ముందు మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవే వాదనలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే అజిత్ తనకు రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నట్లు ఏనాడూ ప్రకటించలేదు. కాగా జర్నలిస్టు, జయలలిత సన్నిహితుడు అయిన కాలచక్రం నరసింహ నాడు జయలలితతో సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో ఈ చర్చను తిరగతోడుతోంది.ఆ వీడియోలో నరసింహ.. ‘ఆమె(జయలిత) తమిళ సినిమాకు చెందిన ఒక నటుడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. అతని హుందా ప్రవర్తన, నిజాయితీ, ప్రజలతో కలిసిపోయే తీరు గురించి ప్రస్తావించారు. అయితే ఆ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కలిగి ఉన్నాడో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియకపోయినా, తమ పార్టీలో చేరేందుకు ఆయన సరైన వ్యక్తి అని ఆమె చెప్పారు. వారసత్వం అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె అజిత్ పేరును నేరుగా పేర్కొన లేదు. అయితే అభిమానులు ఆ నటుడు అజయ్‌ అని స్పష్టంగా చెబుతుంటారు.ఈ అంశంపై అజిత్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. ఒక అభిమాని ‘అజిత్ సర్ 2029 లేదా 2030లో రాజకీయాల్లోకి వస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు.. నా మాటలు నిజం అవుతాయి’ అని పేర్కొనగా, మరొకరు, ‘రాజకీయాలను దగ్గరగా చూస్తే.. ఎవరికైనా ఇది నిజం అని అనిపిస్తుంది’ అని రాశారు. ఇంకొకరు ‘అతను ఏఐడీఎంకేను నడిపించేందుకు సరైన వ్యక్తి అయ్యేవాడు’ అని అభిప్రాయపడ్డారు. అయితే అజిత్ ఇప్పటివరకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అజిత్‌ నటనతో పాటు, తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు సినీరంగంలో ముడిపడి కనిపిస్తాయి. సిఎన్ అన్నాదురై నుండి ఎం.జి. రామచంద్రన్, జయలలిత వరకు.. అందరూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యమ్’ తో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali3
పరిపాలన మహాపతనం!

‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్‌ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్‌ హోటల్‌లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్‌ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్‌ వారి ఛానల్‌లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్‌ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్‌ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్‌ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్‌ జీఎమ్‌గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్‌ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్‌ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్‌ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్‌రెడ్డి అనే సీనియర్‌ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్‌ టీవీ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్‌గా వచ్చే మంత్రి ఫైవ్‌స్టార్, సెవెన్‌ స్టార్‌ హోటళ్లలో దిగి తన రూమ్‌తోపాటు ఇంకో అనుబంధ రూమ్‌ను కూడా మెయిన్‌టెయిన్‌ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు సంబంధించిన పెరోల్‌ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్‌ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్‌’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్‌ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్‌ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్‌ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్‌ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్‌ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్‌డ్‌ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్‌ రూమ్‌లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్‌ బెల్ట్‌ షాపుల్లో 20 శాతం, లైసెన్స్‌డ్‌ షాపుల్లో 5 శాతం, పర్మిట్‌ రూమ్‌లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్‌ సిక్స్‌’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్‌ సిక్స్‌’ సూపర్‌ హిట్‌ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్‌ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్‌ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్‌ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్‌ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్‌ను అందజేసే థర్మల్‌ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్‌టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్‌ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్‌ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్‌ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్‌ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్‌మోహన్‌రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్‌ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్‌ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కాంగ్రెస్‌ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్‌ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్‌ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్‌ – బాబుల మధ్యన హాట్‌లైన్‌ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Aaryavir Sehwag rejects fathers IPL team Delhi Capitals for idol Virat Kohli’s RCB4
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్‌: ఆర్యవీర్ సెహ్వాగ్

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సామ‌న్యుల నుంచి సెల‌బ్రేటిల వ‌ర‌కు విరాట్ కోహ్లిని ఆరాధిస్తుంటారు. ఈ ఢిల్లీ బాయ్‌ ఎంతో మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్‌. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఉన్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్‌స్టార్ విరాట్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాల‌ని ఆర్యవీర్ క‌ల‌లు కంటున్నాడు. త‌న తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్య‌వీర్ మాత్రం ఆర్సీబీకి ఆడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.17 ఏళ్ల ఆర్య‌వీర్ ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో సెంట్ర‌ల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. డీపీఎల్ వేలంలో ఈ అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌ను సెంట్ర‌ల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 ల‌క్ష‌ల భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఆడే అవ‌కాశం అత‌డికి ల‌భించ‌లేదు. సెంట్ర‌ల్ ఢిల్లీ ఆట‌గాడు య‌శ్ ధుల్ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్ల‌నుండ‌డంతో ఆర్యవీర్‌కు మిగితా మ్యాచ్‌ల్లో ఆర్య‌వీర్ భాగ‌మ‌య్యే ఛాన్స్ ఉంది."ప్ర‌స్తుత త‌రంలో విరాట్ కోహ్లి గొప్ప బ్యాట‌ర్‌. కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఐపీఎల్‌లో ఆడే అవ‌కాశం వ‌స్తే క‌చ్చితంగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తాను. అదేవిధంగా మా నాన్న నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను.ప్ర‌తి ఒక్క‌రిని గౌర‌వించ‌డం, అందరితో మర్యాద‌గా న‌డుచుకోవ‌డం, కెరీర్ ప‌రంగా ఎంత ఎదిగినా త‌గ్గే ఉండాలి మా నాన్న మాకు నేర్పించారు అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆర్య‌వీర్ పేర్కొన్నాడు.కాగా ఆర్య‌వీర్ త‌న తండ్రి అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తున్నాడు. గ‌తేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండ‌ర్‌-19 జ‌ట్టు త‌ర‌పున డబుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు.చదవండి: వాంఖెడే స్టేడియంలో గావస్కర్‌ విగ్రహావిష్కరణ

Chandrababu Richest CM in India5
అత్యంత ధనిక సీఎం చంద్రబాబు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. రూ.931.83 కోట్ల ఆస్తులతో ఆయన అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానా­ల్లో రూ.332.56 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ, రూ.51.93 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజా నివేదిక వెల్లడించింది. కేవలం రూ.15 లక్షల ఆస్తులతో అత్యల్ప ఆస్తులున్న పేద సీఎంగా పశ్చిమ బెంగాల్‌ సీఎంమమతా బెనర్జీ, ఆ తర్వాత స్థానంలో రూ.55 లక్షలతో జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఉన్నారు.ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఏడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా రూ.5.31 కోట్ల ఆస్తులతో 19వ స్థానంలో ఉన్నారు. 30 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుదేశంలోని మొత్తం 30 రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.54.42 కోట్లు అని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్‌ సమీక్షించి ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఒక సీఎం సగటు స్వీయ ఆదా­యం రూ.13,34,738గా ఉంది. అలాగే, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుగా ఉంది. అయితే, అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్లకు పైగా అప్పులున్నాయి. సిద్ధరామయ్యకు రూ. 23 కోట్లకు పైగా, చంద్రబాబుకు రూ.10 కోట్లకు పైగా రేవంత్‌రెడ్డికి రూ.1.30 కోట్ల అప్పులున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. క్రిమినల్‌ కేసుల్లో రేవంత్‌రెడ్డి టాప్‌ మరోవైపు.. అత్యధిక క్రిమినల్‌ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిలిచారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ వెల్లడించింది. రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు సీఎం స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. ఇక 12 మంది (40%) ముఖ్యమంత్రులు వారిపై క్రిమినల్‌ కేసులను ప్రకటించుకున్నారని, 10 మంది (33%) వారిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్‌ బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన క్రిమినల్‌ కేసులను ప్రకటించారని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం సీఎంలలో ఇద్దరే మహిళలుఇదిలా ఉంటే.. 30 మంది ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన రేఖాగుప్తా ఇద్దరే మహిళలు ఉన్నారు. అలాగే, 30 మంది సీఎంలలో తొమ్మిది మంది గ్రాడ్యుయేట్లు, ఆరుగురు ప్రొఫెషనల్‌ గ్రాడ్యు­యేట్లు, ఎనిమిది మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ముఖ్యమంత్రులు డాక్టరేట్‌ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా.. 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వారని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

There is widespread debate in the state over the TDP ministers activities 6
రాసలీలల మంత్రి ఎవరు అనగా..!

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్‌ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్‌ స్టార్‌ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. హైదరాబాద్‌లోనూ మంత్రి నీచపు పనులు ‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్‌ స్టార్‌ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్‌మెంట్‌ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్‌లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈయన హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్‌ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్‌ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్‌ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్‌మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్‌మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్‌ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్త­శుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి. కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు » రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీల­లు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నా­యి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మె­ల్యే ఆ­దిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియో­ను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది. » ఇటీవల గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ వీడియో కాల్‌లో ఓ మహిళతో మాట్లా­డు­తూ ముద్దులు పెట్టిన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది. » పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్‌ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

F1 Movie Review Telugu7
రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్‌ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సన్నీ హేన్ (బ్రాడ్ పిట్) ఓ 'ఎఫ్ 1' రేసర్. కుర్రతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఓసారి రేసింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చావు వరకు వెళ్లి బతికి బయటపడతాడు. డాక్టర్స్ హెచ్చరించడంతో తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌ని పక్కనబెట్టేస్తాడు. డబ్బుల కోసం చిన్న రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 'ఎఫ్ 1' రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వస్తుంది. వెళ్తాడు కూడా. ఇతడితో పాటే టీమ్‌లో మరో కుర్ర డ్రైవర్ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్) ఉంటాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దశని దాటి సన్నీ.. ఎఫ్ 1 ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతారు. కొందరు ఫైట్స్ కావాలంటారు. మరికొందరు రొమాన్స్ కోరుకుంటారు. కానీ చాలామంది మాత్రం సరైన కథ ఉండాలి, మనసుని తాకే ఎమోషన్స్ ఉండాలని అంటుంటారు. అలా అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసిన చిత్రం 'ఎఫ్ 1'. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా రేస్ ట్రాక్‌పైనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఓ మంచి మూవీ చూశామనే అనుభూతిని దక్కుతుంది.ఇది రెండున్నర గంటల సినిమా. కానీ మొదటి నిమిషం నుంచే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, రేస్ ట్రాక్‌పై కారు దూసుకెళ్లినంత వేగంగా వెళ్తుంది. డబ్బుల కోసం ఓ రేసింగ్ పోటీలో సన్నీ పాల్గొని గెలిచే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రూబెన్ అనే పాత్ర ఎంటరవుతుంది. ఇతడు అప్పట్లో సన్నీకి ప్రత్యర్థి రేసర్. ఇప్పుడు మాత్రం ఓ రేసింగ్ జట్టుకు యజమాని. తన టీమ్ భారీ నష్టాల్లో ఉందని, డ్రైవర్‌గా రావాలని సన్నీని అడుగుతాడు. దీంతో ఎఫ్ 1 పోటీలో పాల్గొనేందుకు సన్నీ, లండన్ వెళ్తాడు. తొలి రేసులో పాల్గొంటాడు. కానీ తన టీమ్‌లోని కుర్ర డ్రైవర్ జోషువాతో రేసింగ్ ట్రాక్‌పైనే గొడవ పెట్టుకుంటాడు. అలా కలవడం కలవడంతోనే శత్రువుల్లా మారిన వీరిద్దరూ తర్వాత తర్వాత ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. చివరకు ఒక్క రేసులోనైనా గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.30 ఏళ్ల పాటు 'ఎఫ్ 1' రేసింగ్‌కి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఎలా విజేత అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. ఈ లైన్ వినగానే తెలుగులో వచ్చిన 'జెర్సీ' గుర్తురావొచ్చు. అయితే నాని సినిమాలో బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఇందులో మాత్రం హ్యాపీ ఎండింగే ఉంటుంది లెండి.'ఎఫ్ 1' రేసింగ్ అంటే ఏంటి? ఎలాంటి రూల్స్ ఉంటాయి? లాంటి వాటి గురించి మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా సరే ఈ సినిమా చూడొచ్చు. చూస్తే చాలావరకు అర్థమైపోతుంది. టీవీల్లో రేసింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తెర వెనక ఏమేం జరుగుతుంటాయి? అనే అంశాల్ని కూడా ఇందులో చాలా చక్కగా చూపించారు. చూస్తున్నంతసేపు ఓ ప్రేక్షకుడిలా కాకుండా మీరు కూడా రేసర్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుంచి చివరివరకు మిమ్మల్ని స్క్రీన్‪‌కి అతుక్కుపోయాలా చేస్తుంది.ఎవరెలా చేశారు?సన్నీగా చేసిన బ్రాడ్ పిట్.. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూశాక ఇతడికి ఫ్యాన్ అయిపోతారేమో? జోషువా క్యారెక్టర్ చేసిన డామ్సన్, బ్రాడ్ పిట్‌తో పోటీపడి మరీ నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఎ‍క్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో సైలెన్స్‪‌తోనూ వాహ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్.ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఎఫ్ 1' మూవీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్ కావొచ్చు. ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)

Schengen Visa Hike May Upset Your Europe Trip Budget8
యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. షెంజెన్‌ వీసా ధరలు పెరిగాయ్

షెంజెన్‌ వీసా (schengen visa) దరఖాస్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయులకు యూరప్ ప్రయాణాల ఖర్చు పెరిగింది. చాలా యూరోపియన్ దేశాలకు వీసా సమర్పణలను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ తన సర్వీస్ ఛార్జీలను పెంచడంతో ధరలు పెరిగాయి.2023 తర్వాత ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెద్దలకు బేస్ షెంజెన్‌ వీసా ఫీజు దాదాపు రూ. 8,000 - రూ. 10,000 వరకు ఉన్నప్పటికీ.. VFS అదనపు సర్వీస్ ఫీజును వసూలు చేస్తుంది. దీనివల్ల వల్ల మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఈ కొత్త సర్వీస్ ఫీజు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జర్మనీ ఇప్పుడు రూ.1933, స్విట్జర్లాండ్ రూ.2690, పోర్చుగల్ రూ.3111, ఫ్రాన్స్ రూ.2234, ఆస్ట్రియా రూ.2274 వసూలు చేస్తున్నాయి.కొరియర్ డెలివరీ, ఎస్ఎమ్ఎస్ అప్‌డేట్‌లు, ప్రీమియం లాంజ్ యాక్సెస్ వంటి సేవలకు అదనంగా చెల్లించడాన్ని కూడా దరఖాస్తుదారులు ఎంచుకోవచ్చు. దేశాన్ని బట్టి ఈ ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్ స్విట్జర్లాండ్‌కు ఈ పెరుగుదలను ధృవీకరించింది. కానీ ఇతర దేశాలకు ఫీజులు మారాయా?, లేదా?.. అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.షెంజెన్‌ వీసా కలిగిన ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించడానికి అనుమతిస్తుంది. దీనికోసం దరఖాస్తుదారులు ట్రావెల్ ప్లాన్, ఇన్సూరెన్స్ వంటి వాటితోపాటు ఫైనాన్సియల్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా యూరప్ పర్యటనల ఖర్చు పెరగడానికి మరోకారణం అని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంలో రూపాయి బాగా బలహీనపడింది. 2015లో ఒక యూరో ధర రూ.72.12గా ఉంది. 2020లో ఇది రూ.84.64కి పెరిగింది. 2023 నాటికి రూ.89.20కు చేరింది. 2024లో దీని విలువ రూ. 90.55గా ఉంది. కాగా జూన్ 2025లో యూరో విలువ మొదటిదారిగా రూ. 100 దాటిపోయింది. ఇది భారతీయ సందర్శకులకు యూరోపియన్ ప్రయాణ ఖర్చును మరింత పెంచింది.

India Post temporary suspension of parcel services to the USA9
అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్‌

న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్‌ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్‌ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్‌ ఐటమ్స్‌పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్‌ పవర్‌ యాక్ట్‌(ఐఈఈపీఏ) టారిఫ్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్‌ కస్టమ్స్‌ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్‌ షిప్‌మెంట్స్‌పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్‌ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్‌ ఐటమ్స్‌ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్‌ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్‌ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్‌తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్‌ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్‌ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్‌ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు.

Farmers are facing urea woes in Telangana10
ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..

సాక్షి, హైదరాబాద్‌: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్‌ నుంచే ఖరీఫ్‌ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్‌ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్‌ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్‌ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్‌ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్‌ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్‌ టన్నులు. అంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6.87 ఎల్‌ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్‌ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్‌తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్‌తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్‌ మార్కెటింగ్‌ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్‌ మార్కెటింగ్‌కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్‌ కోసం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్‌ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్‌–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్‌ఫెడ్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్‌ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్‌ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్‌ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్‌లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్‌లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 9.80 ఎల్‌ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతి నెలా 1.60 ఎల్‌ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్‌ పాయింట్ల ద్వారా మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్‌ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్‌ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్‌ స్టాక్‌తో కలిపితే మొత్తం 3.61 ఎల్‌ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్‌ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్‌ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్‌లో యూరియా డిమాండ్‌ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్‌లో పత్తి లేకపోవడంతో డిమాండ్‌ అంతగా లేదని అధికారులు అంటున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement