
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్‌టక్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్‌లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్‌టాక్‌లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.

ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది.
