
తిరుపతిలో అమాత్యుడి కామకేళిపై విస్తృత చర్చ
పనుల కోసం వచ్చే మహిళలను లోబరుచుకుని ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో సరసాలు
సదరు మంత్రి లీలలను ఎల్లో మీడియా సాక్షిగా బయట పెట్టింది టీడీపీ నేతే
మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా అరాచకాలు
పనుల కోసం, పథకాల కోసం వచ్చిన వారికి వేధింపులు.. లోబరుచుకోవడాలు
మొన్న ఆదిమూలం.. నిన్న నసీర్ అహ్మద్, కూన రవికుమార్
ఇలా పలువురి బండారాలు బట్టబయలైనా చర్యలు తీసుకోని సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది.
హైదరాబాద్‌లోనూ మంత్రి నీచపు పనులు
‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్‌లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు.
ఈయన హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్ మంత్రి
టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్‌మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్‌మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.
సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి
పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి.
కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు
» రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీలలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది.
» ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్‌లో ఓ మహిళతో మాట్లాడుతూ ముద్దులు పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
» శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది.
» పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.