
సాక్షి, తిరుపతి: విద్య, వైద్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మేలు చేసేందుకే వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. వాటిని ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
‘‘తిరుపతిలో నిలోఫర్ ఆసుపత్రికి మిన్నగా టీటీడీ శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తీసుకువచ్చారు. 2021లో చిన్నపిల్లల హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి గుండె మార్పిడి పరికరాలు అందుబాటులోకి తెచ్చాం. 2021 అక్టోబర్ 3 నుంచి ఇప్పటికీ వరకు మూడువేలకు పైగా ఓపెన్ హార్ట్స్ సర్జరీలు, 15 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలో 15 గుండె మార్పిడులు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఏడాదిన్నర కాలంలో వెయ్యి ఆపరేషన్లు పూర్తి చేయలేదు’’ అని భూమన మండిపడ్డారు.
‘‘80 శాతం పైగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తిరుపతిలో పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 20 శాతం పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయలేకపోయారు. 15 విభాగాలలతో శ్రీపద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం, రాయలసీమకి తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రికి రూ.200 కోట్లతో మూడు దశల్లో పనులు చేపట్టాం. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం, పీజీ హాస్టల్ భవనం, రుయాలో డయాగ్నోసిస్ బ్లాక్‌కు నూతన భవనాలు నిర్మించాము
..న్యూరాలజీ, కార్డియాలజీ బ్లాక్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్విమ్స్ ఆధునీకరణ అవసరం లేదన్నారు. 18 పద్మావతి కాలేజీల హాస్టల్ బ్లాక్ కూడా పనులు నిలిపి వేసింది. వైఎస్ జగన్ పాలనలో మూడువేల మందికి చిన్నారులకు శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా పునర్జన్మ ఇచ్చారు.’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
