
తిరుపతి: పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్‌కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించిందన్నారు. టీటీడీ బోర్డ్ చరిత్రలోనే ఇలా ఒకే ఎజెండా కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. శ్రీవారి పాదాల మంటపం అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధుపుంగవులు, హిందూ సమాజం స్పందించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే...
ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు. కానీ ఈ పాలకమండలి సమావేశంలో అలిపిరికి అంటే శ్రీవారి పాదాల మంటపంకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో టీటీడీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏపీ టూరిజంకు బదలాయించాలనే ఎజెండా అంశాన్ని అంగీకరిస్తూ తీర్మానం చేశారు.
తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏ లో టీటీడీకి ఉన్న 24.68 ఎకరాలు, అలాగే ఇదే సర్వే నెంబర్ లో ఉన్న మరో 10.32 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఇవ్వాలని, దానికి బదులుగా ఏపీ టూరిజంకు తిరుపతి రూరల్ మండలం పేరూరులో సర్వే నెంబర్ 604 లో ఉన్న 24.68 ఎకరాలు, మరో 10.32 ఎకరాలను టీటీడీ తీసుకోవాలనే అంశంపై తీర్మానం చేశారు.
గతంలో ఓబెరాయ్ సంస్థకు హోటల్ నిర్మాణం కోసం వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, శ్రీవారి పవిత్రతకు దెబ్బతీస్తోందంటూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి, మాపైన బుదరచల్లారు. సాధుపుంగవులు కూడా దీనిని వ్యతిరేకించారు. ఇదే క్రమంలో చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చినప్పుడు ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాని, ప్రత్యామ్నాయంగా సమీపంలోనే మరో స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు.
ఇప్పుడు శ్రీవారి అలిపిరికి సమీపంలోనే టూరిజం అథారిటీకి టీటీడీ భూములను కట్టబెట్టడం ద్వారా ముంతాజ్ హోటల్‌ను అక్కడ నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అత్యవసర బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించి తీర్మానం చేసి, వెంటనే ఈ భూబదలాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదేనా శ్రీవారి పవిత్రను కాపాడే విధానం? ఆనాడు ముంతాజ్ హోటల్ ను వ్యతిరేకిస్తూ హిందూసమాజం ఆందోళనలు చేస్తే, దానిని సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థకు ఏకంగా టీటీడీ స్థలానే ఎలా కేటాయిస్తున్నారు? దీనిపై హిందూ సమాజం, సాధుపుంగవులు స్పందించాలి. ఓబెరాయ్ హోటల్ కు ప్రత్యమ్నాయ స్థలాన్ని చూపించాల్సి ఉంటే, ఎయిర్ పోర్ట్ ఏరియాలో ప్రభుత్వ స్థలాలా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇవ్వాలే తప్ప టీటీడీ స్థలంను ఎలా కట్టబెడతారు?
ప్రభుత్వ తప్పిదాల మీద, అవకతవకలపై నేను పెద్ద ఎత్తున స్పందిస్తున్నాను కాబట్టే నాపైన కూటమి ప్రభుత్వం వేధింపులు ప్రారంభించింది. ఎల్లో మీడియా ద్వారా అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారు. 2004లో నక్సల్స్‌తో ప్రభుత్వ చర్చల సందర్భంగా నక్సల్స్ ప్రధాన ఎజెండాలో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభుత్వానికి చెందిన చెరువులు, పోరంబోకు స్థలాలు, కుంటలను రామోజీరావు ఆక్రమించారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈరోజు రామోజీ కుమారుడు కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక నాపైన భూకబ్జా ఆరోపణల చేస్తుండటం విడ్డూరంగా ఉంది. నిజంగా నేను ఎక్కడైనా భూ ఆక్రమణలకు పాల్పడితే నిరూపించమని సవాల్ చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు కూటమి ప్రభుత్వం నాపైన వేధింపులకు, అక్రమ కేసుల బనాయింపులకు పాల్పడుతుందని చాలా స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం కొనసాగిస్తూనే ఉంటాను. హైదరాబాద్ కోహినూరు హోటల్‌లో రాసలీలలు చేసి, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలనుకున్న ఒక పెద్ద నేత నాపైన విచారణకు ఆదేశించారంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. వీటికి భయపడేది లేదు.