కూటమి పాలనపై విసిగిపోయారు!
కమిటీ నియామకాలతోనే పార్టీ బలోపేతం
కమిటీ నియామకాల్లోని అందరికీ
ఐడీ కార్డులు
పార్టీ జిల్లా అధ్యక్షులు
భూమన కరుణాకరరెడ్డి,
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
తిరుపతి మంగళం: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి నమ్మక ద్రోహం చేసిన కూటమి పాలనపై రెండేళ్లకే రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే కార్యకర్తలకే అగ్రస్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేయడంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు ఇతరత్రా ఏ కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలేనని, వారిని మరిచిపోయే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి ఉన్న రెండు సార్లు శ్రీవారి ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారన్నారు. శ్రీవారి భక్తి చానల్, వాడవాడలా శ్రీవారి కల్యాణాలు, దళిత గోవిందం వంటి అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత కరుణాకరరెడ్డిదన్నారు. అలాంటి గొప్ప దైవభక్తి కలిగిన కరుణాకరరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ లడ్డూలో కల్తీ అంటూ దుష్ప్రాచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలతోనే వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేసుకోగలమన్నారు. పార్టీపై అభిమానం, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ కమిటీల్లో నియమించాలని సూచించారు. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐడీ కార్డులు ఇచ్చి, వారికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని, పార్టీకి పునాదులు వారేనన్నారు. జగనన్న వంటి గొప్ప నాయకుడు తిరిగి అధికారంలోకి రాగానే ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అందరి దృష్టి మళ్లించేందుకు శ్రీవారి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అందాయంటే అది ఒక జగనన్న పాలనలో మాత్రమేనన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేద్దామన్నారు. అనంతరం భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా తిరుపతిలో పదివేల మందితో పార్టీ అనుబంధ కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఉన్న యాభై డివిజన్లకు గానూ 45 డివిజన్లలో కమిటీలను పూర్తి చేయడంతోపాటు డిజలైజేషన్ చేశామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటే అందుకు తిరుపతి నగరంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వల్లేనన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
జగనన్న అధికారంలోకి రాగానే కార్యకర్తలకే పెద్దపీట
కూటమి పాలనపై విసిగిపోయారు!


