
పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట
వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని పోలీసులతో చెప్పిస్తున్న సర్కార్
భారీగా తరలివచ్చే జనాలను నిలువరించలేం.. అంత పోలీస్ ఫోర్స్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేం..
రోడ్ షోకు అనుమతి లేదు
అదేరోజు విశాఖలో మహిళల క్రికెట్ మ్యాచ్ ఉంది
మొత్తం పోలీస్ బలగాన్ని ఆ మ్యాచ్‌కు కేటాయించాల్సి ఉంది
అనకాపల్లి ఎస్పీ, విశాఖ పోలీస్ కమిషనర్లు
8 ఏప్రిల్ 2025న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు.
18 జూన్ 2025న పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోయిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థంపర్థం లేని నిబంధనలను పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు. ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్యలోనుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు.
31 జూలై 2025న అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగివచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటనను విఫలం చేయాలని శాయశక్తులా యత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు.
ఈ ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు 66వేల మంది వస్తారని, వారిని నిలువరించలేమని పోలీసులే పేర్కొనడం, జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కారు కుట్రలో వారు పావులుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తోంది. వైఎస్ జగన్ వెళ్లిన ఎక్కడికి వెళ్లినా జనాదరణ వెల్లువెత్తుతుండడంతో సర్కారులో వణుకుపుడుతోంది. ప్రజావ్యతిరేకత పెరిగిపోవడంతో జంకుతోంది. ఫలితంగా ఎలాగైనా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని ఆంక్షలు విధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడుతోంది.
ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఏకంగా 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణమవుతున్న మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గాన వెళితే భద్రత కల్పించలేమంటూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ అప్పటికప్పుడు ప్రకటించడం గమనార్హం. 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో అవసరమైన పోలీసు బలగాలను ఇప్పటికిప్పుడు కేటాయించలేమంటూ సెలవివ్వడం చర్చనీయాంశమైంది.
విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటూ సాకుగా చూపడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పర్యటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు స్వయంగా పోలీసులే... 65 వేల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని, అంత మందికి అక్కడి ప్రాంతం సరిపోదంటూ మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు పంపిన సమాధానంలో పేర్కొనడం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా అంగీకరించినట్టు స్పష్టమవుతోంది.
సవాల్ విసిరి.... చల్లారిపోయి....!
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు 50 సీట్లు కేటాయించారు. మరో ఐదు కళాశాలలను అంతకుముందే ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది.
ఇప్పటికే 60 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో ప్రైవేటు పరంచేసేందుకు సర్కారు కుట్రపన్నింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కాలేజీకి అనుమతులు లేవంటూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొత్తరాగం అందుకున్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీఓ ఉందా? దమ్ముంటే రమ్మనండి.. ఎవరినైనా రమ్మను అంటూ బీరాలు పోయారు. అర్థంపర్థం లేని సవాల్ విసిరారు.
అయితే, స్పీకర్ మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 9న రానున్నారు. ఇప్పటివరకు దమ్ముంటే రమ్మనండి అంటూ సవాళ్లు విసిరిన కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ వస్తుంటే నిజాలన్నీ బయటకు వస్తాయని వణికిపోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.
హెలికాప్టర్‌పై అయితే అనుమతిస్తారట..!
వాస్తవానికి వివిధ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యత్నించిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు కల్పించడం పోలీసులకు పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనను పేర్కొంటూ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు పలు సందర్భాల్లో అనుమతి నిరాకరించిన పోలీసులు... ఇప్పుడు అందుకు విరుద్ధంగా హెలికాప్టర్‌లో వస్తే అనుమతిస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం గమనార్హం.

అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్‌లో ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా.. అందుకు అంగీకరిస్తామని చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా జగన్‌ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ పల్లవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది.
ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతి
విశాఖ సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
పర్యటన ఇలా సాగాలి
» విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.
» అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి.
» ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు.
» ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు.
» మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు.
» ఊరేగింపులు, రోడ్ మార్చ్‌లపై నిషేధం ఉంటుంది.