
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు.
‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్‌సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు.
..గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు.
..తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్‌లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్‌ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు.

..ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్‌సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.