శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అధికారులంతా హాజరు కావాలి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు సోమవారం అన్ని విభాగాలకు చెందిన అధికారులు వందశాతం హాజరు కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి విభాగం నుంచి జిల్లా అధికారి హాజరయ్యేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు అర్జీదారులకు అందుబాటులో ఉండాలని వివరించారు. గత సోమవారం పీజీఆర్‌ఎస్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ సోమవారం అర్జీదారుల సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ముందే సూచించారు. అర్జీలు ఇచ్చిన వారు సమాచారం కోసం 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చునని సూచించారు.
క్షేత్రపాలకునికి అభిషేక పూజలు
తిరుమల: గోగర్భం సమీపంలో రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. ఆనవాయితీ మేరకు శ్రీవారి ఆలయం నుండి టీటీడీ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. అనంతరం పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎస్పీ ఆఫీస్‌లో నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
తిరుపతి అర్బన్:తిరుపతి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఆదివారం మహాశివరాత్రి నేపథ్యంలో పోలీ సులు ఆలయాల వద్ద విధుల్లో ఉన్న తరుణంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు


