చదువర్రీ
విద్యార్థులకు గ్రూపుల టెన్షన్
షైనింగ్ స్టార్స్ అంటూ ఏ, బీ గ్రూపులు
రైజింగ్ స్టార్స్ అంటూ సీ, డీ గ్రూపులు
తాజాగా హజరు, మార్కులు తక్కువ
అంటూ మళ్లీ గ్రూపులు
100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో అనాలోచిత నిర్ణయాలు...
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
ఈ టైంలో హాస్టల్‌లో ఉండలేమంటున్న పిల్లలు
30 రోజుల చదువులు మాకొద్దంటూ ఇంటి బాట
పరీక్షల కాలం
ఇప్పటికే వందరోజుల యాక్షన్ ప్లాన్ అంటూ ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు పరీక్షలు పెడుతున్నారు. మరోవైపు వారం రోజులుగా 10వ తరగతి పిల్లలకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 18 వరకు ప్రీఫైనల్ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత పదో తరగతి పిల్లలకు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. మార్చి 13 వరకు గ్రాండ్ టెస్ట్‌లు రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే షైనింగ్ స్టార్స్ అంటూ ఏ, బీ గ్రూపులను విభజన చేశారు. అలాగే రైజింగ్ స్టార్స్ అంటూ సీ, డీ గ్రూపు పేరుతో విభజన చేశారు. తాజాగా హాజరు తక్కువ, మార్కులు తక్కువ అంటూ మరో గ్రూపును విభజన చేసి హాస్టల్స్‌కు పంపేశారు. అయితే ఇలాంటి కీలకమైన సందర్భంగా గుట్టుగా ఒకే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను హాస్టల్స్‌కు పంపడం విమర్శలకు తావిస్తోంది.
మార్కులు, హాజరు తగ్గిందని హాస్టల్‌కు వెళ్తున్న పిల్లలు
తిరుపతి అర్బన్: వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై భిన్నస్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. విద్యార్థులను పదేపదే గ్రూపుల పేరుతో కలసి చదువుకోనివ్వకుండా విభజన చేయడంపై చర్చసాగుతోంది. ఇప్పటికే నాలుగు గ్రూపులుగా పది పిల్లలు ఉంటే...తాజాగా మార్కులు, హజరు తక్కువ అంటూ మరో గ్రూపును తయారు చేయడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 10 పరీక్షలకు కేవలం 30 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో పాఠశాలల నుంచి హాస్టల్స్‌కు విద్యార్థులను తరలించడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. హాస్టల్ పరిస్థితులకు అలవాటు పడడానికి ఉన్న 30 రోజుల సమయం సరిపోతుందని, తాము ఎప్పుడు చదువుకోవాలంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఓ వైపు విద్యార్థులు, మరోవైపు తల్లిదండ్రులు, ఇంకోవైపు ఉపాధ్యాయులకు బెంగ తప్పడం లేదు.. జిల్లా నుంచి 351 మంది 10వ తరగతి పిల్లలను హాస్టల్స్‌కు తరలించడం సరైన నిర్ణయం కాదని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.
పిల్లల చదువుపై నీలినీడలు
పరీక్షలకు కీలకమైన దశలో హాస్టల్స్‌కి వెళ్లి పాఠాలు చెప్పమంటే... స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటీ అంటూ పలువురు ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ పిల్లాడు ఎలా చదువుతాడు, స్కూల్‌లో పరిస్థితులు మాకు స్పష్టంగా తెలుసునని ఉపాధ్యాయులు అంటున్నారు. అలాగే వెనుకబడిన పిల్లలను ఈ 30 రోజులు ఏలా చదివించుకోవాలో ముందే ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామంటున్నారు. ఈ క్రమంలో హాస్టల్‌కు తరలిస్తే వారి చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోవడంపై ఆందోళన స్పష్టం చేస్తున్నారు.
కొత్త గ్రూప్
హాజరు, మార్కులు తగ్గాయంటూ 10వ తరగతి పిల్లలను కొత్త గ్రూప్‌లో భాగంగా హాస్టల్స్‌కు 351 మందిని తరలించారు. అందులో బాలురు–229 మంది ఉన్నారు. బాలికలు 122 మంది ఉన్నారు. పాఠశాలకు వెళ్లి చదువుకుని వస్తే... ఇంటి వద్ద మంచి భోజనం పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో మా పిల్లలు నిద్రపోయేవారని తల్లిదండ్రులు అంటున్నారు. అయితే హాస్టల్స్‌లోనే పరీక్షల వరకు ఉండాలని చెప్పారు. 30 రోజులు అక్కడే ఉంటే సరైన భోజనం, నిద్రపోవడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయో లేదో అనే ఆందోళన తప్పడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు.
పాఠశాలలోనే చదువుకుంటాం..
రెండు రోజుల క్రితం జిల్లాలోని 351 మంది పదోతరగతి పిల్లలను తమ పాఠశాలల నుంచి హాస్టల్స్‌కు పంపడంతో వారంతా ఉండలేమంటూ ఇంటిబాట పడుతున్నారు. పాఠశాలలోనే చదువుకుంటాం అంటూ వచ్చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే పెద్దోళ్ల ఆదేశాలంటూ విద్యాశాఖ పెద్దలు బలవంతంగా వాళ్లను హాస్టల్‌లోనే కుక్కిపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పరీక్షలకు 30 రోజులు సమయం ఉన్న సందర్భంలో చదువుల్లో వెనుకబడ్డారంటూ సాకుగా చూపించి.... స్కూల్స్ నుంచి హాస్టల్స్‌కు తరలించడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
10వ తరగతి జిల్లా సమాచారం
డివిజన్ ప్రభుత్వ స్కూల్స్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు మొత్తం
తిరుపతి 93 4816 మంది 185 6923మంది 11,739
పుత్తూరు 101 4985 మంది 54 2078మంది 7063
గూడూరు 117 5654 మంది 57 2547మంది 8201
3 డివిజన్లలో 311 15,455 మంది 283 11,548 27,003
30 రోజులు హాస్టల్ డ్యూటీలు సరికాదు
మా స్కూల్‌లో 6వ తరగతి నుంచి మా పిల్లలను ప్రత్యేకంగా చదివించుకుంటున్నాం. ఈ సమయంలో మాకు హాస్టల్ డ్యూటీలు 30 రోజులు(పది పరీక్షలకు 30 రోజులే సమయం) వేస్తే మా పిల్లల పరిస్థితి ఏమిటో తెలియడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు రెండు గంటలపాటు హాస్టల్‌కి వెళ్లి చదువులు చెప్పాలంటూ డ్యూటీలు వేయడం సరికాదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చదువర్రీ


