
పోరుబాట పేరిట విజయవాడలో మహాధర్నా
రూ. 28 వేల కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్
12వ పీఆర్సీ కూడా నియమించకపోవడం దారుణం
30% మధ్యంతర భృతి ప్రకటించాల్సిందే
పీఆర్సీపై 16 నెలలుగా కాలయాపన తగదు.. ఉపాధ్యాయులకు రావాల్సిన 4 డీఏలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే
గత ప్రభుత్వం పెట్టిన ‘హైస్కూల్ ప్లస్’ పునరుద్ధరించాలి
దొడ్డిదారి బదిలీలను ఒప్పుకోం
మహాధర్నాలో ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గళమెత్తింది. ఇకపై బోధనేతర కార్యక్రమాలు నిర్వహించబోమని, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు సమాఖ్య నాయకులు ప్రకటించారు.
తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిరసనగా మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడలో ‘పోరుబాట’ పేరుతో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులతో ధర్నా చౌక్ నిండిపోయింది.
హామీలు అమలు చేయకుంటే సత్తా చూపిస్తాం
మహాధర్నాను ఉద్దేశించి ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయి ఉపాధ్యాయులు పనిచేయలేని విధంగా మారిందన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విమర్శించారు. గత నెలలో జిల్లాల్లో నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఇకనైనా పట్టించుకోకపోతే సహించేది లేదన్నారు.
ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.28 వేలకు పైగా చెల్లించాలని.. వీటిని ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో–57 అమలు చేసి 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.
1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారి బదిలీలు అసమంజసమని, న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని దుయ్యబట్టారు. ఈ తరహా బదిలీలను వెంటనే రద్దు చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత ప్రభుత్వం గ్రామీణ పేద బాలికల ఉన్నత విద్య కోసం ప్రారంభించిన హైసూ్కల్ ప్లస్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి ఫ్యాప్టో ఇచ్చిన నోటీసులోని 20 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఉపాధ్యాయ నాయకులు హెచ్చరించారు. పోరుబాట ధర్నాలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏపీ సీపీఎస్సీఏ బాధ్యులు సీఎం దాస్, సతీష్, బాజీ పఠాన్ తదితరులు మద్దతు ప్రకటించారు.
పాఠాలు చెప్పనీయడం లేదు
గత ప్రభుత్వం గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు హైసూ్కల్ ప్లస్‌లను ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నించింది. దీనిపై పెద్దఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గి, ఆ స్కూళ్లల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను సర్‌ప్లస్ పేరిట బదిలీ చేసింది. ఈ విధానం పేద బాలికలు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కాలరాయడమే అవుతుంది.
బడుల్లో ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలతో పాఠాలు చెప్పనివ్వడం లేదు. ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి. యాప్‌ల భారం తగ్గించి బోధనేతర విధులకు విముక్తి కల్పించాలి. ఇకపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు మాత్రమే యాప్‌లలో నమోదు చేస్తాం. మిగిలినవి బహిష్కరిస్తాం. – సాయి శ్రీనివాస్ (ఎస్టీయూ), ఫ్యాప్టో చైర్మన్
ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది
ఎన్నికల ముందు చంద్రబాబు డైరెక్ట్ పీఆర్సీ ఇస్తామన్నారు. 16 నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. కనీసం ఒక్కసారి కూడా ఉపాధ్యాయులతో చర్చించలేదు. మైకుల ముందు, శాసనసభలో ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రిగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉంటాయనుకున్నాం. కానీ.. పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. బడుల్లో ఉపాధ్యాయులు ఎవరూ పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. ఏడాదిన్నర అవుతున్నా విద్యారంగ సమస్యలపై మంత్రి స్పందించలేదంటే ప్రభుత్వ విద్య అంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. – పి.అశోక్ కుమార్‌రెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్
గిన్నిస్ రికార్డుల కోసమే తపన
కూటమి నాయకులు ఎన్నికల ముందు యాప్‌లు రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మరిన్ని యాప్‌లతో వేధిస్తున్నారు. గిన్నిస్ రికార్డుల పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఆడుకుంటోంది. యాప్‌ల ద్వారా పిల్లలకు అక్షరాలొస్తాయా. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం, ఈలోగా మా డిమాండ్లపై స్పందించాలి. ప్రభుత్వం దిగిరావాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, యూటీఎఫ్
ఉపాధ్యాయులు దొంగలా?
ఉపాధ్యాయులు దొంగలా? మేం దొంగలమైతే పదో తరగతిలో ఎందుకు అంత స్థాయిలో ఫలితాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ చిలక పలుకులు ఉపాధ్యాయుల వద్ద ఇక సాగవు. కూటమి ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ బడులను దిగజారుస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుంటే ఉపాధ్యాయులు పెద్ద ఉద్యమబాట పడతార – ఎన్.వెంకటేశ్వర్లు, డెప్యూటీ సెక్రటరీ జనరల్, ఫ్యాప్టో
విద్యాశాఖవిద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్కడ
ఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు మంత్రి లోకేశ్ ఎక్కడఉపాధ్యాయ సమస్యలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోసం ప్రయత్నిస్తే ఆయన సమయం కేటాయించటం లేదు. విద్యారంగం చాలా విస్తృతమైన విషయమని గుర్తించటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 మాసాలైంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి.
విద్యారంగాన్ని నాశనం చేయటానికి ప్రపంచ బ్యాంక్ సూచించిన సాల్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దానిని వెంటనే రద్దు చేయాలి. 12 పీఆర్సీ కమిషన్‌ను తక్షణం నియమించాలి. ఎన్నికల్లో పదేపదే ప్రకటించిన తెలుగు మీడియంను ప్రవేశ పెట్టాలి.– కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ