
PC: IPL/BCCI
విరాట్ భయ్యా నాతో ఇదే చెప్పాడు
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి ఆడాలనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు చిరకాల కోరిక. అతడితో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకున్నా చాలని తపించే ప్లేయర్లు ఎందరో!.. ఐపీఎల్-2025 ద్వారా ఉత్తరప్రదేశ్ కుర్రాడు స్వస్తిక్ చికారాకు ఆ కల నెరవేరింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ప్రాతినిథ్య వహించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.
ట్రోఫీని ముద్దాడుతూ
అరంగేట్రం చేయకపోయినా.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ పదిహేడేళ్ల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో చికారా భాగమయ్యాడు. అంతేకాదు.. కోహ్లితో కలిసి ట్రోఫీని ముద్దాడుతూ ఫొటోలకు ఫోజులిస్తూ సంతోషంలో తేలిపోయాడు. ఇరవై ఏళ్ల ఈ యూపీ బ్యాటర్ తాజాగా కోహ్లి గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు.
ఆరోజే క్రికెట్‌ను వదిలేస్తాను
‘‘‘నేను ఎంత కాలం ఫిట్‌గా ఉంటే.. అంతకాలం క్రికెట్ ఆడతాను. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం అస్సలు రాను. సింహంలా ఆడటంలోనే మజా ఉంది. నేను 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయగలగాలి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రావాలి.
ఏ రోజైతే నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావాల్సి వస్తుందో ఆరోజే క్రికెట్‌ను వదిలేస్తాను’ అని విరాట్ భయ్యా నాతో చెప్పారు’’ అని స్వస్తిక్ చికారా (Swastik Chikara) రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ఈసారి అందడంతో ఫుల్ ఖుషీ అయిపోయాడు.
వన్డే, ఐపీఎల్‌లో కొనసాగుతున్న కోహ్లి
ఇక 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు ఈ రన్‌మెషీన్.
కాగా 36 ఏళ్ల కోహ్లి ఇప్పటి టీమిండియా తరఫున 123 టెస్టుల్లో 9230, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. వన్డేల్లో సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యంకాని రీతిలో 51 సెంచరీలు సాధించి.. 14181 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటికి 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 8661 రన్స్ రాబట్టాడు.
చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు