
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం (ఆగష్టు 19)న తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే, ఇందులో మిడిల్ ఆర్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మాత్రం చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే.
అదే విధంగా.. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను సెలక్టర్లు ప్రధాన జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శల వర్షం కురుస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసియా కప్-2025 టోర్నీకి తన ప్రత్యామ్నాయ జట్టును ప్రకటించాడు.
ప్రత్యామ్నాయ జట్టు ఇదే.. సారథిగా శ్రేయస్
ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. ‘‘యశస్వి జైస్వాల్‌తో మనం మొదలుపెడదాం. ఆసియా కప్‌నకు బీసీసీఐ ప్రకటించిన ప్రధాన జట్టులో ఈ పేరు ఉండాల్సింది.
టీ20 ప్రపంచకప్-2026 నాటికి అతడు జట్టులో భాగమైతే బాగుంటుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్. ఆస్ట్రేలియాతో గువాహటి మ్యాచ్‌లో అతడు సెంచరీ చేశాడు. జట్టుకు అతడే వైస్ కెప్టెన్. ఐపీఎల్-2025 సందర్భంగా అతడు గాయపడ్డాడు.
మూడో స్థానంలో కేఎల్ రాహుల్
ఏదేమైనా నిలకడగా రాణించే కొద్ది మంది ఆటగాళ్లలో రుతు ఒకడు. కానీ అతడి పేరే బీసీసీఐ పరిశీలనలో లేకుండా పోయింది. ఓపెనర్లుగా జైసూ, రుతు ఉంటారు. ఇక మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఉంటే బాగుంటుంది.
అతడు ఇన్నింగ్స్ ఆరంభించగలడు.. మూడో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. వేగంగా ఆడమన్నా.. వికెట్లు పడకుండా జాగ్రత్త పడమని చెప్పినా.. రెండూ చేస్తాడు. అంతేకాదు.. వికెట్ కీపర్‌గానూ సేవలు అందించగలడు. కానీ ఎందుకో అతడూ పక్కకు వెళ్లిపోయాడు.
వికెట్ కీపర్‌గా పంత్
నా జట్టులో నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తాడు. అంతేకాదు.. కెప్టెన్ కూడా అతడే!.. ఇక ఐదో స్థానంలో రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉంటాడు. నంబర్ 6 ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా బదులు నితీశ్ కుమార్ రెడ్డి వస్తాడు.
ఏడు, ఎనిమిది స్థానాల్లో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లను నేను ఆడిస్తాను. వాషీ బౌలింగ్ చేస్తాడు.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు కూడా పనికివస్తాడు. ఐపీఎల్‌లో ఈ ఏడాది సత్తా చాటిన కృనాల్ పాండ్యాను కూడా నా జట్టులో తప్పక చేర్చాలి కదా!
ఇక రవి బిష్ణోయి.. అతడు తొమ్మిదో నంబర్ ప్లేయర్. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తర్వాతి స్థానాల్లో వస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన తుది జట్టులోని ఆటగాళ్ల పేర్లు వెల్లడించాడు. వీరితో పాటు సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ఖలీల్ అహ్మద్‌లకు తన ప్రధాన జట్టులో ఆకాశ్ చోప్రా చోటిచ్చాడు.
ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
ఆసియా కప్-2025 టోర్నీకి ఆకాశ్ చోప్రా ఆల్టర్నేటివ్ తుదిజట్టు
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.