
ఆసియాకప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీ20లలో నిలకడైన ఫామ్‌తో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను పక్కనపెట్టడం ఇందుకు ప్రధాన కారణం.
అదే విధంగా.. శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను వైస్ కెప్టెన్‌గా జట్టులోకి తిరిగి తీసుకురావడం.. యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేయడం.. భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ప్రసిద్ కృష్ణను కాదని.. హర్షిత్ రాణాను ప్రధాన జట్టుకు ఎంపిక చేయడంతో సెలక్షన్ కమిటీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ప్రత్యక్ష ప్రసారం చేయాలి
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అర్హులైన చాలా మంది ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడం లేదు. అసలు ఓ ఆటగాడిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు?.. వేరొకరిని ఎందుకు పక్కనపెడుతున్నారు? అన్న విషయాలపై ప్రతి ఒక్కరికి స్పష్టత రావాలంటే.. సెలక్షన్ కమిటీ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలి.
చాలా కాలంగా నేను ఇదే మాట చెబుతున్నా. ఇప్పటికీ అదే అంటున్నా. ఏదో హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అర్హులైన వారిని తప్పించడం గురించి ఒకటీ, అరా లైన్లలో సమాధానం చెప్పడం సరికాదు’’ అని మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు.
వారిద్దరు అర్హులు.. అయినా ఎందుకు ఎంపిక చేయలేదు
అదే విధంగా.. ‘‘ఆసియా కప్ జట్టులో స్థానానికి అర్హులైన ఇద్దరు.. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్. కానీ వీరిద్దరికి జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ పాత ఇంటర్వ్యూలో ఓసారి పరిశీలిస్తే.. టీ20 జట్టు నుంచి జైస్వాల్‌ను అస్సలు పక్కనపెట్టకూడదని అతడు చెప్పిన సందర్భాలు కోకొల్లలు.
ఇప్పుడు మరీ స్వయంగా అతడే ప్రధాన కోచ్. అయినా.. యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు కదా!’’ అంటూ టీమిండియా యాజమాన్యం తీరుపై మనోజ్ తివారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
వేచిచూడాల్సిందే
కాగా శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్-2025 టోర్నీకి ఎంపిక చేయకపోవడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు మీడియా సమావేశంలో ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇందులో అతడి తప్పేం లేదు. మా తప్పు కూడా లేదు.
జట్టులో స్థానం కోసం అతడు ఇంకొన్నాళ్లు వేచిచూడాల్సిందే. ప్రస్తుతం 15 మందికే అవకాశం ఉంది. అందులో అతడిని ఎవరి స్థానంలో పిలిపించాలో చెప్పండి’’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య ఆసియా కప్ టీ20- టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యూఏఈ ఇందుకు వేదిక.
చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం