
ఆసియాకప్-2025 మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబర్ 8 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది.
శుబ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు మరోసారి ఆసియాకప్ విజేతగా నిలుస్తుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ నుంచి భారత జట్టు పగ్గాలను చేపట్టిన సూర్యకు కెప్టెన్‌గా ఇదే తొలి మల్టీనేషనల్ టోర్నమెంట్.
"ఆసియాకప్‌నకు యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ కెప్టెన్సీలో టీమిండియా మరోసారి ఆసియాకప్‌లో ఆధిపత్యం చెలాయించే అవకాశముంది.
సూర్య ఆలోచన విధానం టీ20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది. జట్టు మొత్తం అదే వైఖరి కనబరిస్తే టీమిండియా మరోసారి అసియాకప్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్'రాగ్‌రాగ్‌మే భారత్'లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి.
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
చదవండి: చిన్నస్వామిలో క్రికెట్ బంద్!