రాంచీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురువారం జార్ఖండ్‌లో ల్యాండ్ అయ్యాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో అతడికి స్పెషల్ వెల్‌కం లభించింది. ఒకప్పుడు కోహ్లితో కలిసి క్రికెట్ ఆడిన మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ అతడికి దగ్గరుండి మరీ స్వాగతం పలికాడు. చాలా కాలం తర్వాత కోహ్లితో కలిసి సౌరభ్ తివారీ కెమెరాకు చిక్కడంతో వారిద్దరి జ్ఞాపకాలను క్రికెట్ లవర్స్ గుర్తు చేసుకుంటున్నారు. తొలి నాళ్ల నాటి అనుభవాలను నెమరువేసుకుంటున్నారు.
జూనియర్ ధోనిగా ముద్ర పడిన 35 ఏళ్ల సౌరభ్ తివారీ (Saurabh Tiwary).. చాలా సంవత్సరాలు జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో కోహ్లి నాయకత్వంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన తివారీ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. టీమిండియా తరపున కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. 2010, అక్టోబర్ 20న విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు.
ఆర్సీబీలోనూ కోహ్లితో కలిసి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించిన తివారీ 93 మ్యాచ్‌లు ఆడాడు. 2008 నుంచి 2010 ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు. 2011 నుండి 2013 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జట్టులో మళ్లీ విరాట్ కోహ్లితో కలిసి ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన శక్తివంతమైన స్ట్రోక్ ఆటతో జూనియర్ ధోనిగా గుర్తింపు పొందాడు.
ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోకి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JKCA) కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ హోదాలోనే ఇప్పుడు విరాట్ కోహ్లికి హృదయపూర్వ స్వాగతం పలికాడు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలవడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. మాజీ సహచరులు తిరిగి కలిసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజనులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. "నీలం రంగు సూట్‌లో ఉన్న వ్యక్తి కోహ్లి అండర్-19 సహచరుడు అని ఎవరికీ తెలియదు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. "విమానాశ్రయంలో సౌరభ్ తివారీ!" అని మరొకరు పేర్కొన్నారు. "సౌరభ్ తివారీ.. కరణ్ ఔజ్లా లాగా కనిపిస్తున్నాడు!" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
చదవండి: పలాష్ ముచ్చల్ చాట్‌లను బయటపెట్టింది నేనే..
కాగా, నవంబర్ 30 నుంచి భారత్- దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో వన్డే సిరీస్ అయినా గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.


