
వండర్ గర్ల్
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి.
ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్‌స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి.

ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్‌తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్‌సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది.