
తప్పుకోనున్న ఇద్దరు సెలక్టర్లు
ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ చైర్మన్‌గా ఉన్న ఈ బృందంలో ఐదు జోన్‌ల నుంచి ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. టీమిండియా సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులు కోరింది. చీఫ్ సెలక్టర్ అగార్కర్ కాంట్రాక్ట్ 2026 టి20 వరల్డ్ కప్ వరకు ఉండగా, అజయ్ రాత్రా గత అక్టోబర్‌లోనే ఇందులోకి వచ్చాడు. కాబట్టి మిగిలిన ముగ్గురు శివ్‌సుందర్ దాస్ (సెంట్రల్ జోన్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), ఎస్. శరత్ (సౌత్‌జోన్)లలో ఇద్దరు తప్పుకోనున్నారు.
వీరిలో ఏ ఇద్దరు అనేది స్పష్టంగా తెలియికపోయినా... ఎస్.శరత్‌ను గతంలో అతను సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుత జూనియర్ కమిటీ చైర్మన్ తిలక్ నాయుడు పనితీరుపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కమిటీ నుంచి శరత్ తప్పుకుంటే సౌత్‌జోన్ నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్, హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తిగా ఉన్నాడు.
సెంట్రల్ జోన్ కోటాలో సెలక్టర్ పదవిని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా ఆశిస్తున్నాడు. సెలక్టర్ ఎంపిక కోసం సెపె్టంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ బోర్డు గడువు విధించింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల క్రితం రిటైర్ అయినవాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలి. కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు...లేదంటే 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
మరోవైపు సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీలో కూడా మార్పులు ఖాయమయ్యాయి. వన్డే వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేయడంతో ఈ కమిటీ పదవీకాలం ముగిసింది. నలుగురు సభ్యుల ఈ బృందంలో నీతూ డేవిడ్, ఆర్తి వైద్య, రేణు మార్గరెట్ తప్పుకోవడం ఖాయం కాగా... రెండేళ్ల క్రితమే కమిటీలోకి వచ్చిన శ్యామ షా మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.