
సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే
ముంబై: మార్కెట్ పరమైన రిస్క్‌లే కాకుండా మోసపూరిత ఉపసంహరణల పట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అప్రమత్తంగా ఉండాలని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. అలాంటి చర్యలను అడ్డుకోకపోతే ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఫండ్స్ సంస్థలు సదా నిఘా వేసి ఉంచాలని, నేరస్థులు మరింత అధునాతనంగా మారుతున్నందున మోసాలను గుర్తించి, వేగంగా స్పందించాలని కోరారు.
బ్లూచిప్ కంపెనీలకు వెలుపల వైవిధ్యం కోసమని సూక్ష్మ కంపెనీలు, డెట్ పత్రాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ పాలనను కొనసాగిస్తూనే బాధ్యాతయుతమైన వృద్ధిపై ఫండ్స్ సంస్థలు దృష్టి సారించాలని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అమర్‌జీత్ సింగ్ ఈ సందర్భంగా సూచించారు. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ తదితర ఉత్పత్తుల సాయంతో ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచుకోవచ్చన్నారు. ఫండ్స్ పరిశ్రమలో స్వీయ నియంత్రణ కూడా ముఖ్యమన్నారు. తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిర్వహణ ఆస్తులను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కొద్దని హితవు పలికారు.