
జనతంత్రం
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది.
ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.
‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది.
‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్‌లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్‌లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.
ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.
నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము.
కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.
విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్‌గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు.
మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.
తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్‌రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్‌గా వచ్చే మంత్రి ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్‌తోపాటు ఇంకో అనుబంధ రూమ్‌ను కూడా మెయిన్‌టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు.
ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?
మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న.
చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్‌ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.
రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్‌డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్‌లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్‌డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్‌లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.
పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం
వాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు.
20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.
మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే.
‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.
ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు.
వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్‌ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్‌కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్‌టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము.
ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.
రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు
చంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి.
తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్‌మోహన్‌రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.
అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్‌లైన్ లేదంటే నమ్మశక్యమా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com