
కాఫీ, టీలు వేళ్లుకాలేలా తాగితే కేన్సర్ ముప్పు!
వేడి మితిమీరితే అన్నవాహికకు పుండ్లు పడే ప్రమాదం
దీర్ఘకాలంలో కేన్సర్‌గా వృద్ధి చెందే అవకాశం
వెస్టర్న్ సిడ్నీ యూనివర్శిటీ తాజా పరిశోధనలో వెల్లడి
వేడివేడి టీలో మనం రంగు, రుచి, వాసనల్ని ఆస్వాదిస్తాం. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు మైమరిచిపోతాం. అందుకు కారణం, వేడి కూడా ఒక రుచిలా మనకు అలవాటై ఉండటం! అయితే ఈ పానీయాల వేడి.. పరిమితికి మించితే దీర్ఘకాలంలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ తాజాగాహెచ్చరించింది! – సాక్షి, స్పెషల్ డెస్క్
వేడి పానీయాలు వేడిగానే కదా ఉండాలి! వాటిని వేడిగానే కదా తాగాలి! కాకపోతే, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కాస్త వేడి తక్కువగానో, కొంచెం వేడి ఎక్కువగానో తాగుతారు. మరి వేడి వల్ల కేన్సర్ రావటం ఏంటి? వస్తే ఏ రకం వస్తుంది? గొంతుకు వస్తుందా? ఉదరానికి వస్తుందా? నిజానికి వేడి పానీయాలకు, గొంతు కేన్సర్‌కు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఆధారాలూ లేవు.
అలాగే వేడి పానీయాలకు కడుపు కేన్సర్‌కు మధ్య సంబంధం కూడా అస్పష్టంగానే ఉంది. ఇదంతా నిజమే కానీ, మితి మీరిన వేడి ఉన్న పానీయాలను సేవించటం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తాము గుర్తించామని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
65 డిగ్రీలు దాటితే డౌటే!
2016లో ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్’ జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. వేడి పానీయాలను అతి వేడిగా తాగటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. 70 డిగ్రీల వేడి వద్ద ఎలుకలకు పట్టించిన నీరు, అలా వేడి నీటిని పట్టించని ఎలుకలతో పోల్చి చూస్తే, అధిక వేడి నీటిని పట్టించిన ఎలుకల అన్నవాహికలో ముందస్తుగా కేన్సర్ సంకేతాలు కనిపించాయి.
వేడికి ఆమ్లాలు తోడౌతాయి!
పానీయాల వేడికి, ‘గ్యాస్ట్రిక్ ఆసిడ్ రిఫ్లెక్స్’ (కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి వెనక్కి తన్ని, వాపును కలుగజేసే పరిస్థితి) తోడై అన్నవాహిక కేన్సర్ అవకాశాలు పెరగడాన్ని కూడా తాజా అధ్యయనంలో పరిశోధకులు గమనించారు. అలా బయటి ద్రవాల వేడి, లోపలి ఆమ్లాలు కలిసి కేన్సర్ వృద్ధికి కారకాలు అవుతున్నట్లు వారు భావిస్తున్నారు.
‘గుటక’ మోతాదూ విలనే!
ఒకేసారి ఎంత వేడిగా తాగుతారు, ఎంత త్వరగా తాగుతారు అనే దానిపైనే కేన్సర్ ప్రమాదం ప్రధానంగా ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం ప్రకారం.. వేడివేడి పానీయాలను ఒకేసారి ఎక్కువగా తాగితే ఆ వేడి తీవ్రత వల్ల అన్నవాహికకు పుండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరొక అధ్యయనంలో.. వేర్వేరు ఉష్ణోగ్రతలలో వేడి వేడి కాఫీ, టీలు తాగే వ్యక్తుల అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు వారు తీసుకున్న ‘గుటక’ మోతాదు, వేడి కంటే కూడా ఎక్కువ దుష్ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు.
65 డిగ్రీల వేడి ఉండే కాఫీలో ఒక పెద్ద గుటక (20 మిల్లీ లీటర్లు) అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు పెంచటాన్ని వారు గుర్తించారు. అందువల్ల టీ, కాఫీల వంటి వేడి పానీయాలను త్వరత్వరగా కాకుండా.. కాస్త వేడి చల్లారే వరకు ఉండి, నింపాదిగా తాగాలని సూచిస్తున్నారు.
సుఖోష్ణం ఆహ్లాదకరం
టీ, కాఫీ వంటి వేడి పానీయాలను అందరూ వేడివేడిగానే తాగుతారు. వీటిలో ఉండే కెఫినన్, థియోఫిలిన్ అనే రసాయనిక పదార్థాల వల్ల కేన్సర్ రాదు. బాగా వేడివేడిగా తాగడం వ్యాధికారకమని కొందరు అంటున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. మన నాలుక, నోరు భరించలేని వేడిని మనం తాగలేం. టీగానీ, కాఫీగానీ నోటిలోని లాలాజలంతో కలిసినప్పుడు మనం తట్టుకోగలిగే వేడి మాత్రమే ఉంటుంది. ఆ మార్పు యాంత్రికంగా జరిగిపోతుంది. జంతువుల మీద ప్రయోగాలు చేసేటప్పుడు ‘గొట్టాల ద్వారా’ వాటి కడుపులోకి వేడి పానీయాలు పంపుతారు. కాబట్టి అధిక వేడి సాధ్యపడవచ్చు.
ఇక రెండో విషయం.. ఎంత ప్రమాణంలో తాగాలి, రోజుకి ఎన్నిసార్లు తాగవచ్చు? అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా ఏదైనా ప్రమాదకరమే. అతివేడి, అతి చలవ పదార్థాలు వెంటవెంటనే శరీరానికి తగిలినా, నోటిలోకి వెళ్లినా.. మన కణజాలాలు కాలిపోయి చర్మరోగాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆ వ్యాధులు ముదిరితే కేన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగటం చాలా ప్రమాదకరం. ఆ పేపరు పొర కెమికల్స్‌తో కూడినది. దానికి ఏమాత్రం వేడితగిలినా.. రసాయనిక చర్య సంభవించి, అవి మన నోట్లోంచి కడుపులోకి వెళ్లి కేన్సర్ వంటి అనేక రోగాలకు దారితీయవచ్చు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, విశ్రాంత అదనపు సంచాలకులు, ప్రిన్సిపాల్, ఆయుష్ విభాగం