ఇంటి కోసం ల్యాండ్‌ కొనేముందు చూడాల్సినవి.. | Buying land comes with legal financial practical considerations | Sakshi
Sakshi News home page

ఇంటి కోసం ల్యాండ్‌ కొనేముందు చూడాల్సినవి..

Aug 24 2025 7:00 AM | Updated on Aug 24 2025 7:28 AM

Buying land comes with legal financial practical considerations

ఇల్లు కట్టుకోవడం సామాన్యుడి కల. ప్రాథమిక దశలో అందుకోసం ప్లాట్‌ను ఎంచుకోవడం నుంచి చివరకు గృహప్రవేశం వరకు ఎన్నో ఆలోచిస్తారు. ముందుగా ఇల్లు నిర్మించాలనుకునేవారు సరైన ప్లాట్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన దశ. ఇది ప్లాట్‌ ధర లేదా దాని పరిమాణం గురించి మాత్రమే కాదు.. ఒకవేళ అనుకోని కారణాలతో ప్లాట్‌ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోకపోయినా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించేందుకు ప్లాట్‌ కొనుగోలు చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రదేశం

ప్లాట్‌ కొనేప్పుడు సమీప పరిసరాల్లో కనీస మౌలిక సదుపాయాలుండేలా చూసుకోవాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, కిరాణా దుకాణాలు, ప్రజా రవాణా వంటి నిత్యావసరాలకు దగ్గరగా ఉండాలి. సజావుగా ప్రయాణించడానికి ప్రధాన రహదారులు లేదా రహదారి కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్తులో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు రాబోయే ప్రాంతాలు ఆస్తి విలువను పెంచుతాయి.

ప్లాట్ ఆకారం, పరిమాణం

కొనుగోలు చేసే ప్లాట్ ఆకారం చివరవందరగా, తక్కువ పరిమాణంలో ఉంటే ఇల్లు నిర్మించడం కష్టం అవుతుంది. చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకార ప్లాట్లు సరళమైన డిజైనింగ్‌, నిర్మాణానికి అనువైనవని గుర్తించాలి. సరైన ఆకారం లేని ప్లాట్లు నిర్మాణ ప్రణాళికను క్లిష్టతరం చేస్తాయి. ఖర్చులను పెంచుతాయి. ఇవి సాధారణ ప్లాట్ల కంటే తక్కువ ధరకే లభించవచ్చు. అయితే అన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్లాట్ పరిమాణం ప్రస్తుత భవన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే భవిష్యత్తు విస్తరణకు అవకాశం ఉంటే మరీ మంచిది.

నేల నాణ్యత, భూగర్భ జలాలు

మట్టి నాణ్యతను పరీక్షించడంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత కాలంలో నిర్మాణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. నిర్దిష్ట ప్రదేశంలోని ల్యాండ్‌ ‘లోడ్ బేరింగ్ సామర్థ్యం(ఎంత బరువును తట్టుకుంటుందని తెసుకుపోవడం)’ను అంచనా వేయడానికి భూసార పరీక్ష నిర్వహించాలి. వదులుగా ఉన్న భూమి లేదా బంకమట్టి ఉంటే ఇది పునాదిని దెబ్బతీస్తుంది. భూగర్భజలాల లభ్యత, నీటి మట్టం లోతును తనిఖీ చేసుకోవాలి.

లీగల్ వెరిఫికేషన్

భూమిపై పెట్టుబడి పెట్టేటప్పుడు చట్టపరంగా ప్లాట్‌కు స్పష్టమైన టైటిల్ ఉండేలా చూసుకోవాలి. ఆ ల్యాండ్‌ వివాదరహితంగా ఉండాలి. న్యాయపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. స్థానిక మున్సిపల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉండేలా జాగ్రత్తపడాలి.

వాస్తు

వాస్తు తప్పనిసరి కానప్పటికీ, భారతదేశంలో చాలా మంది కొనుగోలుదారులు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేసింగ్‌ ఉన్న ప్లాట్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. శ్మశానవాటికలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు లేదా శబ్దం చేసే పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ప్లాట్లకు డిమాండ్‌ తక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement